నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ప్రమాదవశాత్తు నీట మునిగిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌ను నీటిపారుదల శాఖ అధికారులు పునరుద్ధరించారు. ఒక పంపును ఇవాళ విజయవంతంగా ప్రారంభించి నీటిని ఎత్తిపోశారు. అక్టోబర్ 16న ఎల్లూరు పంపుహౌస్‌లోకి పెద్ద శబ్ధంతో నీరు చేరింది. పంపుహౌస్‌లోని 5 మోటార్లు నీటమునిగాయి. సుమారు 20 మీటర్ల మేర నీరు చేరింది. వారం రోజులపాటు రేయింబవళ్లు అధిక సామర్థ్యమున్న మోటార్లతో నీటిని ఎత్తిపోశారు. ఎత్తిపోత అనంతరం మోటార్లను విడదీసి భాగాలను ఆరబెట్టారు. ఈ ప్రమాదంలో మూడో మోటారు పూర్తిగా దెబ్బతిన్నదని గుర్తించారు. మిగిలిన మోటార్లను మరమ్మతులు చేసి నీటి ఎత్తిపోతపై ట్రయల్ రన్ నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి ఒకటో మోటార్ ద్వారా ఎల్లూరు జలాశయానికి నీటి ఎత్తిపోత ప్రారంభించారు.
ముందుగా చెప్పినట్లుగానే నెల రోజుల్లో నీటి ఎత్తిపోతను ప్రారంభించి ఇంజినీర్లు సత్తా చాటుకున్నారు. పంపుహౌస్ పునరుద్ధరణ కోసం శ్రమించిన ఇంజినీర్లందరిని సాగునీటి ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ అంజయ్య అభినందించారు. వారం రోజుల్లో మరో మోటారును ప్రారంభిస్తామని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పది రోజులకోమోటారు చొప్పున మూడో మోటారు మినహా అన్ని మోటార్లను పునరుద్ధరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఎల్లూరు పంపుహౌస్ వద్ద ప్రమాదం జరిగి నెలరోజులు గడిచినా.. ప్రమాదానికి కారణాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు.
ఇవీ చూడండి:'దేశంలోని మొత్తం నిఘానేత్రాల్లో 65 శాతం హైదరాబాద్‌లోనే...'