నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ముక్కిడిగుండం, నార్లాపూర్ గ్రామాల్లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వాన జోరుగా కురుస్తోంది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముక్కిడిగుండం.. ఉడుముల వాగు, నార్లాపూర్ పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు జలకళ సంతరించుకున్నాయి.
రాత్రి కురిసిన వర్షానికి పెంట్లవెల్లి చెరువు, చుక్కాయిపల్లి చెరువు, కోడెరు మండలంలోని మూడు చెరువులు నిండాయి. ముక్కిడిగుండం గ్రామానికి చుట్టూ వాగులు ఉండడం వల్ల ప్రజలు దిగ్భందంలో చిక్కుకున్నారు. బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును తాడు సహయంతో భయంభయంగా దాటుతున్నారు. వాగును దాటేటపుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నామని ప్రజలు చెబుతున్నారు.
రైతులు పొలాలకు వెళ్లి పనులు చేసుకోవాలన్నా వాగులు దాటాలని స్థానికులు పేర్కొంటున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతం ప్రవహిస్తున్నాయి. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మా పరిస్థితి ఏంటని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు.
హెచ్చరిక...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. విరామం లేకుండా కురుస్తున్న వానతో.. పట్టణాలు, గ్రామాలన్ని జలమయమవుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు(Rain Updates) కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మేఘాలు కమ్ముకున్న ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది.
- ఇదీ చదవండి : ts rains: ఎడతెరిపిలేని వర్షం... స్తంభించిన జన జీవనం