నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో ఉదయం ఆరు నుంచి 8 గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. బస్తీల్లోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వరద నీరు ఒక్కసారిగా కాలనీల్లోకి ప్రవహించడంతో పట్టణంలోని ఆదర్శ్‌నగర్ కాలనీ, శివ సాయి నగర్, టీచర్స్ కాలనీ, మారుతి నగర్, రాజీవ్ నగర్ కాలనీల్లో వరద నీరు ఇళ్ల మధ్యలోకి చేరింది. నీరు నివాసాల్లోకి చేరడంతో బస్తీవాసులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.
బస్టాండ్ ప్రాంతాల్లోనూ..
అచ్చంపేట బస్టాండ్ పరిసర ప్రాంతాలు సైతం జలదిగ్బంధంలో ఉన్నాయి. రహదారులపైకి మోకాళ్ళ లోతు నీరు ప్రవహించింది. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లాయి. దుకాణ సముదాయాల్లో వర్షపు నీరు చేరడంతో దుకాణ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. చిరు వ్యాపారస్తుల తొపుడు బండ్లు, డబ్బాలు అధిక నీటి తాకిడికి కొట్టుకుపోయాయి.
బ్రిడ్జిపై నుంచి వరద..
అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలోని అంబటిపల్లి-యాపట్ల గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జికి భారీగా వరద నీరు రావడంతో నీరు పొంగిపొర్లుతుంది. ఫలితంగా ఆయా గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ బ్రిడ్జిపైనుంచి భారీగా వరద పొంగుతుండటం వల్ల లింగాల, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.