నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురిసింది. వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు దెబ్బ తిన్నాయి. తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఈదురుగాలులకి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. బిజినేపల్లి, పాలెం, నంది వడ్డేమాన్, మహాదేవుని పేట, లట్టు పల్లి, గంగారం సహా పలు తండాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
అల్లిపూర్, ఊడుగులకుంట తండాలో రేకుల ఇళ్లు కూలిపోయాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. నంది వడ్డేమాన్, అల్లిపూర్, మహాదేవుని పేట గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. వడగండ్ల ధాటికి వడ్లు రాలిపోయాయి.
ఆయా గ్రామాల్లో బొప్పాయి, మామిడి తోటలు దెబ్బతినడం వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. ఆరుగాలం కష్టించి చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చే దశలో వర్షం తాకిడికి దెబ్బతినడం వల్ల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చూడండి: భువనేశ్వర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్ సరఫరా