తెరాస మైనార్టీ నాయకుడు అన్వర్ ఖాన్ మృతి చెందడం తన హృదయాన్ని కలచి వేసిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన తెరాస నాయకుడు అన్వర్ ఖాన్ గత వారం రోజుల క్రితం కరోనా బారినపడి శనివారం మృతి చెందారు. అన్వర్ ఖాన్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
తన తమ్ముడి లాంటి వాడిని కోల్పొయానని ఎమ్మెల్యే బాధ పడ్డారు. ఆయన భౌతిక కాయనికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్వర్ ఖాన్ మరణ వార్త విని షాక్ గురయ్యానని... నిత్యం ప్రజలకు సేవ చేస్తూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. అన్వర్ ఖాన్ మరణం పార్టీకి తీరని లోటని కన్నీరు పెట్టుకున్నారు. పార్టీ మంచి నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడిని కోల్పొయిందని తెలిపారు. అన్వర్ ఖాన్ కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.