నాగర్కర్నూల్ జిల్లా మన్ననూరు అటవీ రేంజ్ పరిధిలో గత శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో అటవీశాఖ సిబ్బంది గిరిజనులపై ఎలాంటి దాడి చేయలేదని ఆ శాఖ డివిజనల్ అధికారి రోహిత్ పేర్కొన్నారు. కొన్ని పత్రికల్లో చెంచులపై దాడి జరిగినట్లు రాశారని, అది అసత్యమని... ఘర్షణ జరిగింది అచ్చంపేట చెంచుపలుగు తండా లంబాడి తెగకు చెందిన వారితోనని ఆయన స్పష్టం చేశారు. మన్ననూర్ అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
శుక్రవారం రాత్రి అడవిలో మంటలు వ్యాపించాయని సమాచారం రావడంతో సెక్షన్ ఆఫీసర్ రామాంజనేయులు సహా ఇతర సిబ్బంది అడవిలోకి వెళ్లారని రోహిత్ పేర్కొన్నారు. అక్కడ సుమారు 29 మంది గిరిజనులు ఉన్నారని.. 3 రోజులుగా అక్కడే ఉంటున్నారని తెలిపారు. సిబ్బందిని చూసి ముగ్గురు గిరిజనులు పారిపోయారని, లోయ ప్రాంతం కావటంతో దారికనబడక వారికి గాయాలయ్యాయని వివరించారు. మిగతా వారిని దుర్వాసుల బేస్ క్యాంపునకు తరలించామని చెప్పారు.
విషయం తెలుసుకోకుండా కొంతమంది తమ సిబ్బందిపై కర్రలతో, రాళ్లతో దాడి చేశారని, వాహనాన్ని ధ్వంసం చేశారని రోహిత్ తెలిపారు. మర్మాంగాలపై దాడి అసత్య ఆరోపణగా కొట్టిపారేశారు. వివాదాన్ని పెద్దది చేయాలన్న ఉద్దేశంతోనే అలాంటి ఆరోపణలు చేశారని అభిప్రాయపడ్డారు. మర్మాంగాలపై దాడి జరిగిందని వారు కూడా చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. తమకందిన నివేదికలో తీవ్ర గాయాలైనట్లు ఎక్కడా లేదన్నారు. గాయపడిన బాధితులకు, సిబ్బందికి వైద్య ఖర్చులు తామే భరిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: గిరిజన మహిళలపై ఫారెస్ట్ సిబ్బంది దాష్టీకం.. నలుగురి పరిస్థితి విషమం