నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతమైన పదర మండలం చిట్లంకుంటకు చెందిన బాలెంకులు పేద రైతు. మూడు ఎకరాల భూమి ఉన్నా, ఆర్థిక కారణాలతో ఎనిమిదేళ్ల కిందట తన ఎడ్లను అమ్మేశారు. మళ్లీ కొనాలంటే కనీసం రూ.50-60వేలు కావాలి. దాంతో కూలీగా మారి కుటుంబాన్ని పోషించేవారు. మళ్లీ సొంత ఎద్దులతో పొలం దున్నుతానని ఆయన కలలోనూ అనుకోలేదు. అలాంటి తరుణంలో లభించిన చేయూత ఆయన జీవితాన్నే మార్చేసింది. తెలుగు రాష్ట్రాల గోశాలల సమాఖ్య ఆయనకు జత కోడెలను ఉచితంగా అందించగా ఏడాదిలోనే అవి అరకకు ఎదిగి వచ్చాయి. రెండేళ్లుగా పొలాన్ని సాగు చేసుకోవటంతోపాటు ఇతరుల పొలాలనీ కౌలుకు తీసుకుని మిరప పంట వేస్తూ ఏటా రూ.లక్షన్నరకు పైగానే సంపాదిస్తున్నారు. ఇలా చేయూత దొరికింది ఈ ఒక్క రైతుకే కాదు. చిట్లంకుంటలోనే మరో 40 మంది నిరుపేద రైతులకు 80 కోడెలను అందించింది సమాఖ్య.
ఒక్కడే ఉద్యమిస్తున్నాడు...
హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది మహేశ్ అగర్వాల్‌కు చిన్ననాటి నుంచీ పశుపక్ష్యాదులంటే ప్రేమ. న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే గోవులు కబేళాలకు తరలకుండా అడ్డుకునేవారు. మహేశ్ సేవలను గుర్తించి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆయన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి ప్రత్యేక అధికారిగా గతంలో నియమించింది. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గోశాలల నిర్వాహకులను ఒక్క తాటిపైకి తెచ్చి ‘గోశాలల సమాఖ్య’ ఏర్పాటు చేశారీయన. రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాల సమాఖ్యలకూ గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎక్కడ ఆవులను కబేళాకు తరలిస్తున్నట్లు తెలిసినా గోశాలల నిర్వాహకులతో కలిసి పోలీసుల సాయంతో అడ్డుకొని స్థానిక గోశాలలకు వాటిని అప్పగిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో 240కి పైగా గోశాలలు ఉన్నాయి. వాటిలో లక్ష వరకూ గోవులూ, వాటి సంతతీ ఉన్నాయి. మహేశ్ చొరవతో గోశాలల నిర్వాహకులు రైతులకు గోఅర్క, ఫినాయిల్, సబ్బులు, వ్యవసాయంలో వినియోగించే జీవామృతం తయారీలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆవులూ, ఎద్దులూ ముసలివైనా, వాటిని పోషించటం కష్టమైనా దళారులకు అమ్మకుండా స్థానిక గోశాలలకు వాటిని అప్పగించేలా రైతుల ఆలోచనల్లో మార్పు తెస్తున్నారు. వేసవిలో పశుపోషణ కష్టమైతే గోశాలలో అప్పగించి తర్వాత ఎప్పుడైనా తీసుకువెళ్లమని చెబుతున్నారు.
రైతుకు అండగా...
గోశాలల్లో పశు సంపద పెరుగుతుండటం చూసి వాటిని పేద, దళిత, గిరిజన రైతులకు పంపిణీ చేస్తే బాగుంటుందని భావించారు మహేశ్. ఇదే విషయాన్ని గోశాలల నిర్వాహకులకు చెప్పి ఒప్పించారు. దీనివల్ల గోశాలలపై పోషణ భారం తగ్గడంతోపాటు పేద రైతులకు కొండంత అండ లభిస్తోంది. పంపిణీ చేసిన కోడెలను విక్రయించకుండా, పశువుల ఎరువు వినియోగిస్తూ, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేలా ఆయా గ్రామాల సర్పంచులూ, లబ్ధిదారులతో ఒప్పందం చేసుకుంటున్నారు. సాగు రైతులనే కాదు, ఉపాధి కోసం చూసే గ్రామీణ పేదలకూ గోదానం చేస్తూ ఆదుకుంటోంది సమాఖ్య. పదర మండలంలోనే రాయలగండి తండాలో ‘నందీశ్వర గోశాల’ ఆధ్వర్యంలో 20 మంది గిరిజన రైతులకు 40 గోవులను పంపిణీ చేశారు. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలంలోని రామవరం శ్రీవెంకటేశ్వర గోశాల ద్వారా 20 మంది రైతులకు 40 లేగ దూడలను ఉచితంగా అందించారు. గోశాలల సమాఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 15 వేల ఎద్దులనూ, కోడెలనూ, దూడలనూ రైతులకు పంపిణీ చేయటం విశేషం. అంతేకాదు దేశవాళీ జాతుల్ని ఆదరించేలా రైతుల్ని ప్రోత్సహిస్తోంది. తెలంగాణ వైపు నల్లమలలోని తూర్పు జాతి ఎద్దులకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు దక్కేలా వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు గోశాలల సమాఖ్య కృషి చేసింది. ‘యాంత్రీకరణ పెరగడంతో పాడి పశువుల పెంపకం తగ్గిపోయింది. అయితే గోవుల్ని సంరక్షించుకుంటేనే సమగ్ర, ప్రకృతి వ్యవసాయం సాధ్యమవుతుంది’ అంటారు మహేశ్(9394005600).
ఇదీ చదవండి: Leopard: మెదక్ జిల్లాలో బోనులో చిక్కిన చిరుత