కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎల్లూరు పంపు హౌస్లో ఎట్టకేలకు మూడో మోటార్ మరమ్మతులు చేపట్టారు. బీహెచ్ఎల్ కంపెనీ ఈ పనులను ప్రారంభించింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు రేగుమాన్ గడ్డ ప్రదేశంలోని ఎల్లూరు పంప్ హౌస్లోకి గతేడాది అక్టోబర్లో నీరు చేరడంతో నెల రోజుల పాటు ఎత్తిపోతలు నిలిచిపోయాయి. విడుతల వారీగా మొదట్లో 1, 2 , 4 మోటర్లతో నీటిని ఎత్తిపోశారు. 3వ, 5వ మోటార్లకు మరమ్మతులు చేయక అవి పని చేయలేదు. ఈ క్రమంలో మిగతా మోటార్ల ద్వారా సాగునీరు అందించారు.
త్వరలో ఐదో మోటారు
ఎల్లూరు తీరంలోని రేగుమాన్ గడ్డ ప్రదేశంలో నీటి నిలువ తక్కువగా ఉండడంతో ఆయకట్టుకు సాగునీటి విడుదలను ప్రస్తుతం నిలిపివేశారు. మిషన్ భగీరథ పథకానికి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఐదు మోటార్ల ఒకేసారి పని చేస్తే 40 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బీహెచ్ఈఎల్ కంపెనీ 3వ మోటారు మరమ్మతులు చేపట్టింది. పూర్తిస్థాయిలో నీరు తగ్గిన తర్వాత ఐదో మోటర్ మరమ్మతులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
తాగు, సాగు నీరు
ఈ ప్రాజెక్ట్ ద్వారా నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథ పరిధి పథకంలోని 19 పురపాలికలు 4,500 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. వేసవిలో తాగునీటి అవసరాలకు ఎల్లూరు నుంచి నీటిని సరఫరా చేస్తారు. వానాకాలం నాటికి ఐదో మోటర్ అందుబాటులోకి వస్తుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: లోపాన్ని దాచిపెట్టి... పరువుకోసమే పెళ్లి..