Donkey Farm in Nagarkurnool district : నిలకడగా ఏ పనీ చేయకుండా కాలంగడిపే వారిని గాడిదలు కాస్తున్నావా అంటూ చీవాట్లు పెట్టడం చాలామందికి అనుభవమే. కానీ ఆ గాడిదల పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకున్న ఓ వ్యక్తికి లాభాల పంట పండుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి మండలం వెలుగొండకు చెందిన పులిదండ నగేష్ గాడిదల పెంపకాన్ని వ్యాపారంగా ఎంచుకున్నాడు.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ, దేశీయ విపణిలోనూ ఇప్పుడిప్పుడే గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. వాటిని సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీలో ఈ పాలను వాడుతున్నారు. మన దేశంలో చిన్నపిల్లలకు, ఉబ్బసం రోగులకు గాడిద పాలు తాగిస్తుంటారు. ఐరోపా దేశాల్లో గాడిదల పాలను ప్యాక్ చేసి అమ్ముతుంటారు. డిమాండ్‌కు తగినట్లుగా ఈ పాల ఉత్పత్తి లేకపోవడంతో దేశంలో గాడిదల పెంపకానికి డిమాండ్ పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన నవీన్ దాన్నే వ్యాపారంగా మలుచుకుని లాభాల బాటలో పయనిస్తున్నాడు.
"ఈ పాలను కాస్మటిక్స్ తయారీలో ఎక్కువ ఉపయోగిస్తారు. యూరప్ దేశంలో దీనికి డిమాండ్ అధికంగా ఉంది. 70-80 శాతం కాస్మటిక్స్ తయారీలో వీటినే ఉపయోగిస్తారు. 20-30శాతం ఫార్మా ఇండస్ట్రీకి పోతున్నాయి. ఇండియాలో 3,4 ఫామ్స్ కంటే ఎక్కువ లేవు. తెలంగాణలోనే మాది మొదటి ఫామ్. 35 లక్షల రూపాయలు నిర్మాణానికి ఖర్చయింది. గాడిదలకు మొత్తం పెట్టుబడి 80-90లక్షల పెట్టుబడి అవసరమైంది. కోటి 30 లక్షల రూపాయలు ఫామ్ కోసం పెట్టుబడి అయింది. ప్రతినెలా రూ.3లక్షలు ఖర్చవుతోంది. రూ.6లక్షల వరకు లాభం వస్తోంది." - పులిదండ నగేశ్, గాడిదల ఫామ్ యజమాని
గాడిదల పెంపకమంటే అంత ఆషామాషీ కాదు. ఈ వ్యాపారంలోకి దిగాలనుకునే వారు.. గాడిదల లభ్యత, రకాలు, వాటి ఆహారం, ఎంతెంత పాలిస్తాయనే విషయాలను ముందుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందులోభాగంగా నగేశ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఏఆర్ ద్వారా గాడిదల పెంపకంపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. తర్వాత గాడిద పాలు కొనేందుకు తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లిలో ఫాం ఏర్పాటు చేశాడు. 6 ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా షెడ్లు నిర్మించాడు. గాడిదల గ్రాసం కోసం మరో 10ఎకరాలు లీజుకు తీసుకుని... జొన్న, దశరధగడ్డి, సూపర్ నేపియర్, కందగడ్డ తీగ, వరి సాగు చేస్తున్నాడు.
నగేశ్ వద్ద 110 గాడిదలున్నాయి. వాటిలో 40 గుజరాజ్‌కు చెందిన హలరీ, 45 రాజస్థాన్‌కు చెందిన కతియావాడీ, 10 దేశవాళీ, 4 ఫ్రాన్స్‌కు చెందిన పోయిటు జాతికి చెందినవి. హలరీ రోజుకు లీటరు పాలిస్తే, కతియావాడీ ముప్పావు లీటరు, దేశవాళీ అరలీటరు లోపు, పోయిటు మాత్రం రోజుకు 2 లీటర్ల వరకు పాలిస్తున్నాయి. మొత్తం గాడిదల్లో 60 పాలిస్తున్నాయి. మొదట్లో నెలకు 250 లీటర్ల మాత్రమే ఉత్పత్తైన పాలు ప్రస్తుతం నెలకు 550 లీటర్లకు చేరుకుంది. ఈ పాలను శీతల యంత్రాల్లో నిల్వ ఉంచుతున్నారు. తమిళనాడుకు చెందిన సంస్థ 15 రోజులకోసారి వచ్చి ఈ పాలను సేకరిస్తోంది. వీరికి నెలకు 9లక్షల రూపాయల ఆదాయం వస్తుండగా.. నిర్వాహణకు 3 లక్షల రూపాయల వరకు ఖర్చవుతున్నాయి. 6 లక్షల వరకు ఆదాయం వస్తోందని నగేశ్ చెప్తున్నాడు.
ఇవీ చదవండి: