బంగారు తెలంగాణ కాస్తా కరోనా రోగుల రాష్ట్రంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేసారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి సదుపాయాలు లేక రోగులు విలవిల్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శనలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో మాజీ ఎంపీ మల్లు రవితో కలిసి భట్టి సందర్శించారు. జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇంతవరకు ఎన్ని కొవిడ్ పరీక్షలు చేశారని ఆరా తీశారు.
జిల్లా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించలేదని భట్టి తెలిపారు. సరైన సౌకర్యాలు లేవని... పరీక్షలకు సంబంధించిన ఓ మిషను కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. కరోనా బాధితులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామన్నారు. కృష్ణా నదీ జలాలపై శాసనసభలో గళమెత్తుతామన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ఫాంహౌస్‌ను వదిలి ప్రజా వైద్యశాలల పనితీరుపై సమావేశం ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.