నాగర్‌కర్నూల్ జిల్లా సింగాయపల్లి తండాకు చెందిన నారమ్మది నిరుపేద కుటుంబం. ఆమెకు ముగ్గురు కుమారులు...వారిలో ఇద్దరు చిన్నవాళ్లే. పెద్ద కొడుకు శివుడు. అతడిపైనే ఆశలన్నీ. ఇంతలో మాయదారి క్యాన్సర్ ఆమె ఆశల్ని చిదిమేసింది. పేదరికమనే రోగం ముందు ఈ పెద్ద రోగానికి భయపడలేదు. కర్నూలు పెద్దాసుపత్రికి వెళ్తే హైదరాబాద్ పొమ్మన్నారు అక్కడి వైద్యులు.
లాక్‌డౌన్ ఉన్నా కష్టాల కంచెలు దాటుకుంటూ కొడుకును తీసుకుని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ ఎంఎన్‌జే ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ స్కానింగ్ కోసం బసవతారకం ఆసుపత్రికి పంపించారు. దానికి ఖర్చు రూ.20వేలు అవుతుందన్నారు. బతిమాలితే రేపు రమ్మని పంపించారు. అయినా పని జరగలేదు. దీంతో చేసేదేం లేక మూడు రోజులుగా ఆ ఆసుపత్రి సమీపంలోనే రోడ్లపైనే గడుపుతున్నారు. దాతలిచ్చే ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటున్నారు. తన కొడుకును కాపాడేందుకు ఎవరైనా సాయం చేస్తారని ఆమె దీనంగా ఎదురు చూస్తోంది.
కడుపులో మంట అంటూ కొడుకు ఏడుస్తుంటే తన గుండెల్లో రక్తం కారుతున్నట్లుందని.. ఎక్కడికి వెళ్లాలో తెలీదని.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ తల్లి.