నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం వద్ద కేఎల్ఐ పంపు హౌస్‌లోకి చేరిన నీటిని తొలగించే ప్రక్రియ వేగవంతమైంది. నాలుగు రోజుల కిందట పంప్‌హౌస్‌లోకి దాదాపు 50 మీటర్ల పైగా నీరు చేరుకోవటం వల్ల పూర్తిగా మోటర్లతో సహా మూడు భవనాలు మునిగిపోయాయి. ప్రాజెక్టు అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన అధికారి స్మిత సబర్వాల్ ప్రాజెక్ట్‌ను సందర్శించిన తర్వాత నీటి తొలగింపును ముమ్మరం చేశారు.
పంపు మోటార్ల నుంచి నీటిని దాదాపు తొమ్మిది 600 హెచ్పీ కెపాసిటీ గల మోటార్లతో నీటిని ఎత్తివేస్తున్నారు. ఇప్పటి వరకు 22 మీటర్లు తగ్గినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇంకా 16 మీటర్లకు పైగా నీటిని ఎత్తివేస్తే మోటర్లు పూర్తిగా తేలే అవకాశం ఉందన్నారు. రెండు, మూడు రోజుల్లో నీటిని పూర్తిగా ఎత్తి పోసే అవకాశం ఉందన్నారు.
వైజాగ్ నుంచి 15 మంది గజ ఈతగాళ్లు వచ్చి పంప్‌హౌస్‌లోని మోటార్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నీటిలోకి వెళ్లి మోటార్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.