నిత్యం జలకళ ఉట్టిపడుతూ... పర్యాటకులతో కళకళలాడే ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు కళ తప్పింది. వర్షకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా.... నీటి జాడ లేక చెరువు అడుగంటిపోతోంది.
నిరాశలో పర్యటకులు
ఏటా తొలకరి పలకరింపుతోనే 30 అడుగుల మేర నీరు చేరి.... ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా మారేది. ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచే ఉయ్యాల వంతెన, చిన్నచిన్న ఐలాండ్‌లతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు విదేశాల నుంచి సైతం పర్యటకులు తరలివస్తుండేవారు. రోజుకు 4వేలకు మందికి పైగా ఇక్కడికి వచ్చేవారు. కానీ, ఈ ఏడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే పర్యటకుల సంఖ్య చాలా వరకు తగ్గిపోగా... వచ్చిన కొద్ది మంది సైతం నిరాశతో వెనుదిరుగుతున్నారు.
గోదావరి జలాలతో నింపితే సరి..!
సుమారు 9వేల ఎకరాల ఆయకట్టు కలిగిన ఈ చెరువు వర్షాలు లేక జలకళను సంతరించుకోలేకపోయింది. ఎగువన ఉన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వర్షాలు పడితేనే నీళ్లొస్తాయి. లక్నవరాన్ని గోదావరి జలాలతో నింపి, ఆధునికీకరిస్తామని ఏళ్ల తరబడిగా ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారు. అయినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానిక రైతులు వాపోతున్నారు.
లక్నవరం అభివృద్ధిపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని పర్యటకులు కోరుతున్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా రామప్ప సరస్సుకు నీటి తరలింపులో భాగంగా లక్నవరం కూడా నింపితే నీటి సమస్య నుంచి బయటపడొచ్చు అంటున్నారు.
- ఇదీ చూడండి : 'ఏపీ, కర్ణాటక రాజకీయాలపై మాకు ఆసక్తి లేదు'