MEDARAM Special Busses : ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా ఆర్టీసీ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను ఆయన దర్శించుకున్నారు. ఈనెల 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం జాతర సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నాలుగు వేలకు పైగా బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
RTC MD Sajjanor Visit MEDARAM : భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన రీతిలో బస్సులను ఏర్పాటు చేశామని... ప్రైవేటు వాహనాల్లో రాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సూచించారు. ప్రైవేటు వాహనాలు గద్దెలకు 56 కిలోమీటర్ల దూరంలో ఆగుతాయని... కానీ ఆర్టీసీ బస్సులు గద్దెలకు కిలోమీటర్ దూరం వరకు వస్తాయని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రైవర్లు కండక్టర్లు కావలసిన సిబ్బంది మొత్తం 12,500 మందిని ఏర్పాటు చేశామని... సీనియర్ అధికారులు 300 మంది విధుల్లో ఉంటారని అన్నారు. ఏపీ నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చే వారికోసం 30 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతర సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి 4వేల బస్సులు నడపడం జరుగుతుంది. సుమారు 12,500 మంది సిబ్బంది విధుల్లో పాల్గోనున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుభప్రదం, సుఖకరం. జాతర సందర్భంగా సుమారు 25 లక్షల మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశాము. ఈ కార్యక్రమాన్ని ఆదాయ మార్గంగా పరిగణించడం లేదు. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇదొక సమాజ సేవ అనే ఉద్దేశంతో బస్సులు నడపడం జరుగుతుంది. మారుమూల ప్రాంతం నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. భక్తులందరీ ఆర్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నాం. ఏవైనా సందేహం ఉంటే కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌చేసి కనుక్కోవచ్చు. 30 మంది ఉంటే వారు ఉన్న చోటుకే బస్సును పంపడం జరుగుతుంది. గత కొంతకాలంగా ప్రజలందరూ ఆర్టీసీని ఆదరిస్తున్నారు. ఈ జాతర సందర్భంగా ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం.
-సజ్జనార్, ఆర్టీసీ ఎండీ
ఇదీ చూడండి: మేడారం జాతరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు.. వివరాలు ఇవే..!