ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవం జరగనుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి 23 వరకు జరిగే శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా... చలువ పందిళ్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు, అగ్నిగుండం, తాత్కాలిక మరుగుదొడ్లు, కల్యాణ వేదిక ఏర్పాటు చేశారు.
రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్ని వేదపండితులు ఖరారు చేశారు. ఈ నెల 21న ఉదయం నాలుగున్నరకు సుప్రభాతంతో ప్రారంభమవుతుంది. ఉదయం ఆరుగంటలకు గణపతి పూజ, అఖండ దీపారాధన, పుణ్య వచనము, అంకురార్పణ, రక్షాబంధనం, సామూహిక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది.
22న ప్రత్యేక పూజలతో పాటు స్వామికి ప్రత్యేక రుద్రాభిషేకంతో మొదలవుతుంది. ఉదయం 11 గంటలకు గణపతిపూజ, గ్రహాధారణ, సాయంత్రం భద్రకాళిపూజ, సహస్రనామార్చన, బలిహరణ, అదే రోజు రాత్రి దీపోత్సవం తెల్లవారుజామున అగ్నిగుండాల ప్రవేశము జరుగుతుంది. 23న ఉదయం సుప్రభాతంతో ప్రారంభమై గణపతి పూజ ప్రత్యేక రుద్రాభిషేకంతో ఉదయం 8 గంటలకు నాగావళి గెలుపు, ఆశీర్వచనము, తీర్థ ప్రసాద వినియోగం చేస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ప్రధాన పూజారి కోరారు.
ఇదీ చూడండి: నాలుగోసారి పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్!