ములుగు జిల్లా మేడారం జాతరకు వచ్చే భక్తులు పాటించాల్సిన విధివిధానాలపై వరంగల్ సీపీ రవీందర్, ములుగు జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనున్న గిరిజన కుంభమేళాలో 8 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని అన్నారు. అన్ని క్యాడర్ల అధికారులు పాల్గొని ఎలాంటి ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు ఎటు నుంచి రావాలి అనే విషయాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రోడ్డుపై వాహనాలను నిలుపరాదని సూచించారు. పార్కింగ్ పాయింట్లలో మాత్రమే పార్కింగ్ చేయాలని ఆయన కోరారు.
29 విశాలమైన పార్కింగ్ స్థలాలు
ఈసారి జరిగే మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని సంకల్పించుకున్నామని తెలిపారు. పసర వరకు ప్రతి నాలుగు కిలోమీటర్లకి, పసర నుంచి మేడారం వరకు ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు చేశామన్నారు. ఎల్లవేళలా రోడ్లపై నిఘా ఉంచి ట్రాఫిక్ జామ్ కాకుండా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. జంపన్న వాగు సమీప ప్రాంతాలలో 29 విశాలమైన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు పక్కన నిలిపే వాహనాలను టోయింగ్ వెహికల్స్ ద్వారా పక్కకు తొలగించి జరిమానా విధించబడుతుందని తెలిపారు. వాహనాలను ఓవర్ టేక్ చేయకుండా రోడ్డుకు ఎడమ వైపు ఒకే లైన్లో వాహనాలు నడపాలన్నారు. అన్ని వాహనాలకు, ఎడ్లబండ్లకు తప్పనిసరిగా ముందు, వెనుక భాగంలో రేడియం స్టిక్కర్స్‌ని అంటించుకోవాలన్నారు.
భక్తులు పోలీసు వారి సూచనలు పాటించి జాతరను దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరిస్తారని కోరుకుంటున్నామని తెలిపారు. జాతర రూట్ మ్యాప్‌ను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఏఎస్పీ సాయి చైతన్య ఆవిష్కరించారు.
ఇదీ చూడండి : కోమటి చెరువు అందాలు చూడతరమా..!