హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ పొరుగుసేవ సిబ్బందితో కలిసి దోపిడీకి పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు పొరుగు సేవల సిబ్బంది ఉన్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఘట్‌కేసర్, ఎస్వోటీ పోలీసుల బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. నకిలీ వే బిల్లులు సృష్టించి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి రూ. 3 లక్షల 20 వేల నగదు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 9 చరవాణులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లారీలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో సోదాలు జరిపామని పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఇసుక మాఫియా, నకిలీ వే బిల్లుల తయారీపై డ్రైవర్‌ను విచారించినట్లు వెల్లడించారు. నిందితులు నవీన్, కిరణ్, రాజశేఖర్ ఇసుక రాకెట్‌ను నడిపిస్తున్నారని వివరించిన ఆయన... వారిని ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పట్టుకున్నట్లు తెలిపారు. లారీ యజమానిని పిలిపించి విచారించామని పేర్కొన్నారు.
నకిలీ బిల్లులతో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పక్కా సమాచారంతో పట్టుకున్నామని అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఇసుక అక్రమార్కులకు రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ పొరుగుసేవ సిబ్బంది సహకారం విచారణలో తేలిందన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్