Medaram Jatara 2022 : మేడారం జాతర వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈనెల 16 నుంచి 19 వరకు జరిగే జాతరకు కోటిమందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశముందని పేర్కొన్నారు. శుక్రవారం జంపన్నవాగులోకి నీటిని విడుదల చేశామని చెప్పారు. శుక్రవారమిక్కడ డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాదాయ, ఇంజినీరింగ్ విభాగాల పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయన్నారు.
‘‘జాతరలో పారిశుద్ధ్యం కోసం పంచాయతీరాజ్‌శాఖ నుంచి 5వేల మంది సిబ్బందితో పాటు 19 జిల్లాల పంచాయతీరాజ్ అధికారులకు బాధ్యతలు అప్పగించాం. మేడారం పూజారులు, ట్రస్టుబోర్డు సభ్యులతో కలిసి పనిచేయాలి. ఆర్టీసీ 3,850 బస్సులతో దాదాపు 21 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించనుంది. మేడారంలోని ప్రధాన ఆసుపత్రితో పాటు మరో 35 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నాం. 327 ప్రాంతాల్లో 6,700 మరుగుదొడ్లు నిర్మించాం. అంటువ్యాధులు, నీటి కాలుష్యాన్ని నిరోధించేందుకు నిరంతర క్లోరినేషన్ చేయాలి. తప్పిపోయిన వారికోసం 18 చోట్ల పిల్లల క్యాంపులు ఉంటాయి’’.
- సోమేశ్ కుమార్, సీఎస్
Medaram Jatara Today : మేడారం జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ ఏర్పాట్లు పూర్తిచేసిందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. అనుభవజ్ఞులైన పోలీసు అధికారులను కూడా విధుల్లో నియమించామన్నారు. జాతర కోసం 9వేల మంది పోలీసు అధికారులు విధుల్లో ఉంటారని వెల్లడించారు.
మహాజాతరకు రావాలని గిరిజన సంక్షేమ, దేవాదాయ శాఖల కార్యదర్శులు క్రిస్టినా చొంగ్తు, అనిల్‌కుమార్‌లు రాష్ట్ర గవర్నర్ తమిళిసైని ఆహ్వానించారు. శుక్రవారం ఆమెను రాజ్‌భవన్‌లో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానపత్రం అందజేశారు.
ఆదివారం నుంచి హెలికాప్టర్ సేవలు
Helicopter services in Medaram Jatara : ఈసారి కూడా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో భక్తులను మేడారం చేరవేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. హనుమకొండ నుంచి మేడారానికి వెళ్లి రావడానికి ఒకరికి రూ.19,999 ఛార్జీ నిర్ణయించారు. అలాగే 8 నుంచి 10 నిమిషాల జాతర విహంగ వీక్షణానికి రూ.3,700లుగా నిర్ణయించారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో హెలికాప్టర్లను నడపనున్నారు. టికెట్ బుకింగ్ కోసం 94003 99999, 98805 05905 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. info@helitaxii.com వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు. హెలికాప్టర్లలో వెళ్లేవారి కోసం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఒక్కో ట్రిప్పులో ఆరుగురు వెళ్లేందుకు వీలుంటుంది.
హాట్ ఎయిర్ బెలూన్, పారా సెయిలింగ్ రైడ్లు నేటి నుంచి
Para Sailing Rides in Medaram Jatara : హాట్ ఎయిర్ బెలూన్, పారా సెయిలింగ్ రైడ్లు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాజస్థాన్‌లోని రెండు సంస్థల ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా ఈ రైడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌కు రూ.1,000, పారా సెయిలింగ్‌కు రూ.500గా నిర్ణయించినట్లు నిర్వాహకుడు రోహితస్వ బిస్సా తెలిపారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో నలుగురు, పారా సెయిలింగ్ ద్వారా ఒకరు ఆకాశంలో 5 నుంచి 10 నిమిషాల వరకు విహరించొచ్చని చెప్పారు. మేడారంలోని హరిత హోటల్ పక్కన వీటిని నిర్వహించనున్నారు. ఇవి జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
అమ్మలకు ‘బంగారం’.. వయా ఆర్టీసీ
RTC Offer to Telangana People : ఏదైనా కారణాల వల్ల మేడారం వెళ్లి సమ్మక్క-సారలమ్మకు మొక్కు చెల్లించుకోలేని భక్తుల కోసం ఆర్టీసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. స్థానికంగా బంగారం (బెల్లం) కొని.. సమీపంలోని ఆర్టీసీ కార్గో కార్యాలయంలో ఇస్తే, దాన్ని తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. జాతర ముగిసిన తర్వాత ఆ భక్తులకు ఫోన్ చేసి.. ప్రసాదం, పసుపు, కుంకుమ, అమ్మవార్ల ఫొటోలు అందజేయనున్నట్లు ఎంజీబీఎస్ డిపో సహాయ మేనేజర్ సుధ తెలిపారు.