medaram national status issue: ఆదివాసీ ఆరాధ్యదేవతలైన సమ్మక్క, సారలమ్మల మహా జాతరకు ముహుర్తం సమీపిస్తోంది. వచ్చే నెల 16 నుంచి నాలుగు రోజుల పాటు జాతర ఘనంగా జరగనుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తల్లుల చెంతకు వచ్చి... ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి... జాతరకు తరలివచ్చే భక్తులకోసం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్ని చేస్తున్నా... మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు అంశం మరోసారి తెరమీదికొచ్చింది.
ముందుగానే.. మొక్కులు
medaram jatara: వనంలో ఉన్న దేవతలు జనంలోకి వచ్చి... నీరాజనాలు అందుకునే సమయం దగ్గరపడుతోంది. జంపన్నవాగు జనసంద్రంగా మారే శుభముహుర్తం సమీపిస్తోంది. మాఘ శుధ్ద పౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు కనులపండువుగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ నుంచి భక్తులు తరలివస్తారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు నెలవైన ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. కొవిడ్ ఉధృతిని దృష్ట్యా... భక్తులు ముందుగానే మేడారానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
జాతీయ పండుగగా గుర్తించాలని ప్రతిపాదన
telangana biggest fair: మహా జాతర సమీపిస్తున్న వేళ… జాతీయ పండుగగా గుర్తింపు అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. జాతరలు వస్తున్నాయ్ పోతున్నాయ్ తప్ప… జాతీయ పండుగ గుర్తింపు మాత్రం దక్కట్లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైతోంది. ఆదివాసీల సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మేడారం జాతరకు 1996 ఫిబ్రవరి 1న రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు జాతర నిర్వహణను చేపట్టింది. తెలంగాణ ఏర్పడిన తరువాత జాతర ప్రాముఖ్యత మరింత పెరిగింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని... కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తోంది. మహా జాతరకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలంటూ రాష్ట్రం నుంచి అనేకసార్లు కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లినా ప్రయోజనం లేదని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు.
''744 గిరిజన జాతులుంటే.. అందులో ఆదివాసీ మిత్రులకు ఆ భగవంతుడు సమ్మక్క, సారలమ్మలను ఇచ్చాడు. అక్కడికి మనమందరం వెళ్లే అవకాశముంది. వేరే కులాల వారికీ ఆ ఛాన్స్ కూడా లేదు. ఈ దేశంలో 12 కోట్ల బంజారాలు ఉంటే.. ఎక్కడా ఒక దేవత లేదు. వారిని కలిసే అవకాశం కూడా లేదు. అవకాశమున్న వాటికి జాతీయ హోదా ఇవ్వమంటే కేంద్రం వెనకడుగు వేస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతిలో పని అది. అయ్యో ఖర్చు ఏముంది. జాతీయ హోదాతో ఆ జాతికి గుర్తింపు వస్తుంది కదా.''
సీతారామ్ నాయక్, మాజీ ఎంపీ
''8 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పరంగా రూ.332 కోట్లు ఖర్చు చేశాం మేడారం జాతర మీద. రోడ్లకు గానీ, హరిత హోటళ్లకు గానీ.. అక్కడ భక్తులకు కావాల్సిన మౌళిక సదుపాయాలకు ప్రభుత్వం ఖర్చు చేసింది. కేంద్రం తరఫున ఒక రూ.100 కోట్లు అయినా ఇప్పించగలిగారా కేంద్రం తరఫున. కనీసం జాతీయ హోదా అయిన తెప్పించగలిగారా?''
-కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ
సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు దక్కితే... జాతర ఖ్యాతి దేశవ్యాప్తమౌతుంది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు రావడం ద్వారా భక్తులకు సదుపాయాలు పెరుగుతాయి. జాతీయ పండుగ గుర్తింపు దక్కేలా కేంద్రం ముందడుగు వేయాలని భక్తులు కోరుకుంటున్నారు.
ఇదీ చూడండి: ఎన్నికల బరిలో యువకిశోరాలు.. గెలుపుతో బోణీ కొడతారా?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!