ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలో ఐటీడీఏ శాఖ ద్వారా నిర్మాణమవుతున్న 35 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా జెడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ పరిశీలించారు. నాణ్యత విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. రాజీ పడవద్దని ఏఈని హెచ్చరించారు. అనంతరం ఇటీవల కురిసిన వర్షాలకు ధ్వంసమైన ఎక్కెల గ్రామానికి వెళ్లే రోడ్డును ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా గ్రామానికి వెళ్లే కాజ్ వే పూర్తిగా ధ్వంసం కాగా రాకపోకలు నిలిచిపోయాయి. వెంటేనే ఐటీడీఏ డీఈ మధుకర్‌తో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో సంబంధిత రోడ్డును పునరుద్ధరించే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏటూరునాగారం మండల కేంద్రంలో రూ.7 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఆర్అండ్బీ రోడ్డు పునరుద్దరణ పనులను ఆయన ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం చేపడుతున్న ఈ రోడ్డు పనుల విషయంలో రోడ్డు వెడల్పునకు అందరూ సహకరించాలని ప్రజలను కోరారు. ఎవరైనా అడ్డు చెబితే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ డీఈ రఘువీర్‌కు సూచించారు. పనులు, నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని.. అనునిత్యం సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పనులు జరగాలని డీఈకి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం ప్రసాద్, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యురాలు వలియాబి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్