మేడారం జాతర నేపథ్యంలో రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. జాతీయ రహదారుల విభాగం వరంగల్ డివిజన్ పరిధిలోని పనులపై... హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కార్యాలయంలో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రోడ్లు – భవనాల శాఖ ఇంజినీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి, ఎస్ఈ వసంత, ఈఈ వెంకటేశ్వరరావు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
డిసెంబర్‌లోపు రోడ్ల మరమ్మతు పూర్తి చేయాలి...
హైదరాబాద్ నుంచి వరంగల్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని మంత్రులు తెలిపారు. ఆలేరు, వంగపల్లి, వరంగల్ నగరం బైపాస్ రహదారుల పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, కరీంనగర్ మార్గాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా రోడ్లకు అవసరమైన మరమ్మతు చేయాలని చెప్పారు. వరంగల్ ఎన్‌హెచ్ డివిజన్‌కు సంబంధించి ప్రతిపాదన దశలో ఉన్న 5 రహదారులకు జాతీయ రహదారి హోదా వచ్చేలా డిల్లీ స్థాయిలో ఎంపీలు సంప్రదింపులు జరపాలని సూచించారు. ఖాజీపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మేడారం జాతరకు అనుసంధానం అయ్యే అన్ని రకాల జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు ఇతర రోడ్ల పనులను డిసెంబర్ లోపు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!