అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్లు అందిస్తుందన్నారని పేర్కొన్నారు.
మార్చి 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రం, ఏటూరునాగారం మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మంత్రి హాజరయ్యారు.
రైతు బీమా, రైతుబంధు, చెప్పిన వాగ్ధానాలు నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. బట్టకాల్చి మీద వేయడం కాదు.. దమ్ముంటే గెలిచి చూపించండి అంటూ భాజపా నేతలను విమర్శించారు. తప్పుడు వాగ్ధానాలు సబబు కాదని హితవు పలికారు. పోడు భూముల పట్టాలు త్వరలోనే ఇస్తామని తెలిపారు.
గిరిజన యూనివర్సిటీని కేంద్రం ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని.. పైగా తెరాస ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదని విమర్శించారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తెలంగాణ చూస్తుంటే అది రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. తప్పుడు వాగ్ధానాలు భాజపా మానుకోవాలన్నారు.
ఇదీ చూడండి: కొప్పుల ఈశ్వర్.. ఉత్సవ విగ్రహమే..: సీఎల్పీ నేత భట్టి