Medaram Arrangements మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా.. భక్తుల కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. వసతుల కల్పనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు వెల్లడించారు. వసతుల కల్పన, కరోనా జాగ్రత్తలు, జాతరను విజయవంతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఫిబ్రవరి 8 నుంచి భారీ వాహనాలు మళ్లిస్తామన్నారు. భక్తులు జాతరకు ఎక్కువగా వస్తున్నందున ఈ నెల 8 నుంచి 20 వరకు జాతర మార్గాల్లో భారీ వాహనాలు రాకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు.
వాహనాల దారి మళ్లింపు...
Traffic diversion : హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం, గుడేప్పాడ్ నుంచి భూపాలపట్నం మార్గంలో ములుగు జిల్లా చివరి వరకు ఈ భారీ వాహనాలు(ఇసుక లారీలు) ప్రయాణించవని మంత్రి తెలిపారు. కేవలం భక్తులు, స్థానికుల వ్యక్తిగత, ప్యాసింజర్ వాహనాలు మాత్రమే తిరుగుతాయన్నారు. ఈ మార్గంలో వచ్చే వాహనాలు చర్ల - కొత్తగూడెం- ఖమ్మం - సూర్యాపేట -హైదరాబాద్ వెళ్తాయని తెలిపారు. మరొక మార్గంలో మణుగూరు - కొత్తగూడెం - ఖమ్మం - సూర్యాపేట - హైదరాబాద్ మార్గాలకు మళ్లించినట్లు పేర్కొన్నారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి..
మరో వైపు పారిశుద్ధ్య నిర్వహణకు అధిక సంఖ్యలో సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. జోన్ల వారిగా విభజించి, అధికారులకు బాధ్యత అప్పగిస్తామని... ప్రత్యేక యాప్స్, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ద్వారా వసతుల వివరాలు తెలియజేస్తామని తెలిపారు. క్యూలైన్లు, చలువ పందిళ్లు, సీసీ కెమెరాలతో నిఘా, షీటీమ్స్, మఫ్టీ పోలీసుల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
కొవిడ్ నిబంధనలు పాటించేలా..
కరోనా నేపథ్యంలో వైద్య సిబ్బందిని గతం కంటే రెండింతలు పెంచినట్లు మంత్రి తెలిపారు. టెస్టులు చేసేందుకు కేంద్రాలను పెట్టామని, పాజిటివ్ తేలితే వెంటనే వారికి చికిత్స చేసేందుకు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సానిటైజర్లు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే అక్కడున్న అత్యవసర నంబర్లకు, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సాయం పొందాలని సూచించారు.
ఇదీ చూడండి: Ramanuja Sahasrabdi Utsav 2022: ముచ్చింతల్‌లో వైభవంగా ఐదోరోజు సహస్రాబ్ది వేడుకలు