Medaram Hundi Counting: హనుమకొండ జిల్లా కేంద్రంలోని తితిదే కళ్యాణ మండపంలో మేడారం వనదేవతలకు భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు మూడో రోజు కొనసాగుతోంది. సీసీ కెమెరాల పటిష్ఠ భద్రతల మధ్య మేడారం హుండీ లెక్కింపు జరుగుతోంది. మొత్తం ఇప్పటివరకు 497 హుండీలకు గాను 181 హుండీలను లెక్కించారు. ఇప్పటివరకు రూ.3,85,22,000 ఆదాయం వచ్చింది. హుండీల్లో డబ్బులతో పాటు వెండి ఆభరణాలు వస్తున్నాయి. ఓ భక్తుడు వెండి పెన్నును హుండీలో వేశాడు. లెక్కించిన నగదును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకు అధికారులకు అప్పగించి బ్యాంకులో జమ చేస్తున్నారు.

దేవస్ధానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. లెక్కింపు జరిగే మండపం పరిసరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు పది రోజుల పాటు లెక్కింపు జరగనుంది. ఏ రోజుకారోజు వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల్లో అధికారులు జమచేస్తున్నారు.

రెండేళ్ల క్రితం జాతరలో ఎంత వచ్చిందంటే..
2020లో మేడారం జాతర సందర్భంగా రూ.15 కోట్ల 54 లక్షల 71 వేల రూపాయల ఆదాయం వచ్చింది. వాటిలో నగదు రూపేణా రూ.11 కోట్ల 65 లక్షలు ఆదాయం చేకూరిందని... వాటితో పాటు కిలో 63 గ్రాముల బంగారం, 53 కిలోల వెండి సమకూరింది. గతంలో 502 హుండీలను ఏర్పాటు చేశారు.

భారీగా తరలివచ్చిన భక్తులు
మేడారం మహా జాతరలో ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై.... తల్లులను దర్శించుకున్నారు. నెల ముందు నుంచి... జాతర వరకూ కోటి ముప్పై లక్షలకుపైగా భక్తులు దర్శించుకున్నారని అంచనా వేశారు. జాతర ముగిసిన తర్వాత ఆదివారం కూడా దాదాపు పదిలక్షలపైగా భక్తులు వచ్చి గద్దెల చెంత పూజలు చేశారు.

మహాజాతర విజయవంతం..
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జాతరకు నెల రోజుల ముందు నుంచే.. మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. 50 లక్షల మందికిపైగా భక్తులు.. జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. వేడుక జరిగిన నాలుగు రోజుల్లోనూ రద్దీ కొనసాగింది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. తాగునీటి విషయంలో.. జనం కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి: