తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర దగ్గరపడుతోంది. కీకారణ్యం జనారణ్యంగా మారేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మేడారం జనసంద్రంగా మారుతోంది. జంపన్నవాగు వద్ద భక్తుల కోలాహలం పెరిగింది. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు రోజులు పాటు వైభవంగా జరిగే ఈ జాతర... ఆదివాసీ సంప్రదాయలకు నిలువెత్తు నిదర్శనం. జాతర జరిగే రోజుల్లో ఈ ప్రాంతంలో కనీసం కాలుపెట్టే చోటుండదంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
లక్షలమంది భక్తులు వచ్చే జాతరకు ఆర్టీసీ నాలుగువేలకుపైగా బస్సులతో సన్నద్ధమైతే... రైల్వే శాఖ ఇప్పటివరకూ ప్రత్యేక రైళ్ల విషయంలో ఎలాంటి ప్రకటనా.. చేయలేదు. జాతరకు పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు వస్తుంటారు. హైదరాబాద్, విజయవాడ నుంచి బస్సుల్లో రావడం ప్రయాసతో కూడుకున్నదే... ప్రైవేటు వాహనాలకైతే... భారీగా చెల్లించకోక తప్పదు. వీరందరికీ రైళ్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఆయా ప్రాంతాలనుంచి... వరంగల్, కాజీపేటలకు ప్రత్యేక రైళ్లు నడిపితే...ఎంతో ఉపయోగపడుతుంది.
గత జాతర సమయాల్లో కూడా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ప్రత్యేక రైళ్లను మూడు రోజుల పాటు నడిపింది. అప్పటికప్పుడు నడపడం... ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఈసారి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. ప్రత్యేక రైళ్ల సమయాన్ని ముందుగా ప్రకటిస్తే భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది.
హైదరాబాద్, రంగారెడ్డి నుంచి వచ్చేవారు తిరుగు ప్రయాణంలో హన్మకొండ వరకు వచ్చే బస్సులే ఎక్కుతారు. అక్కడి నుంచి వేరే బస్సులు మారాలి. ఇలా వ్యయప్రయాస కోర్చి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక రైళ్లు వేసినట్లైతే ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
ఇదీ చూడండి: కలెక్టర్ బదిలీ... ఎంపీడీవో సస్పెన్షన్...