Liquor Sales in Medaram Jatara: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నెల రోజుల ముందు నుంచే అమ్మవార్ల దర్శనాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధికంగా భక్తులు విచ్చేస్తుంటారు. కాగా జాతరలో అమ్మవార్లకు నిలువెత్తు బంగారంతో పాటు.. ఎదురుకోళ్లను సమర్పించడం ఆనవాయితీ. కుటుంబసమేతంగా జాతరకు తరలివచ్చే భక్త జనం.. అక్కడే వంటలు చేసుకుని ఆనందంగా గడుపుతారు. ఈ నేపథ్యంలో అక్కడ మాంసంతో పాటు మద్యానికీ గిరాకీ ఎక్కువ. జాతర ఉన్నన్ని రోజులు మాంసం, మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. సాధారణ రోజుల్లో మేడారం ప్రాంగణంలో రెండే వైన్ షాపులు ఉండగా.. జాతర సమయంలో మరిన్ని షాపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రతిసారి జాతరలో మద్యం వ్యాపారులు ఎక్కువ మొత్తంలో బెల్టు షాపులను ఏర్పాటు చేసి మద్యంప్రియులకు విక్రయించేవారు. ఆ షాపుల నుంచి ట్రాలీ ఆటోల్లో తరలించి కిరాణా దుకాణాలకు విక్రయించేవారు. దుకాణదారులు అధిక ధరకు అమ్ముకునేవారు.
మైకుల ద్వారా ప్రచారం
ఈ క్రమంలో మద్యం ప్రియుల అవసరాన్ని గుర్తించిన కొందరు వీధి వ్యాపారులు.. షాపుల నుంచి మందు బాటిళ్లను కొనుగోలు చేసి.. ఏకంగా జనం వద్దకే వచ్చి విక్రయిస్తున్నారు. ట్రాలీ ఆటోలకు మైకులు ఏర్పాటు చేసి.. మరీ అమ్మకాలు జరుపుతున్నారు. జాతరలో మద్యానికి ఉన్న డిమాండ్ మేరకు.. ఈ రకంగా వీధి వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్న ఎక్సైజ్ పోలీసులు మాత్రం చూసి చూడనట్లు ఉంటున్నారు. వారికిచ్చే మామూలు వారికందుతుండటం వల్లే ఇంత బహిరంగంగా విక్రయాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 16 నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర జరగనుంది. జాతరకు ఆ నాలుగు రోజుల్లో కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా జాతర ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకుంటున్నారు. జాతర కోసం ఆర్టీసీ 3,845 బస్సులను నడపనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలకు అన్ని వేళలా సిద్ధంగా ఉండేలా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Medaram Tollgate charges : మేడారం భక్తులపై మరోభారం.. తప్పని 'టోల్' తిప్పలు