Illegal Soil Mining in Mulugu: ములుగు జిల్లా సహజ వనరులకు నిలయం. వాటిని సద్వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు స్థానికులకు ఉపాధి లభిస్తుంది. కానీ... సహజవనరులపై కన్నేసిన అక్రమార్కులు... బండారుపల్లి శివారులోని దైతబోడు గుట్టను కొల్లగొడుతున్నారు. ఇక్కడి నుంచి ఇష్టారీతిన జేసీబీలతో తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా మొరాన్ని తరలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, కొత్త భవన నిర్మాణాలకు, రహదారులకు... ఇక్కడి నుంచే అక్రమ రవాణా చేస్తున్నారు.
యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నా... ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గనులు, రెవెన్యూశాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో... అక్రమార్కులు రేయింబవళ్లు గుట్టకు నలువైపులా తవ్వకాలు జరుపుతున్నారు. ఖనిజ సంపద అక్రమార్కుల పరం అవుతోంది. మట్టి, మొరం, ఇసుక, ఇలా ఏది తవ్వకాలు చేపట్టాలన్నా, రవాణా చేయాలన్నా తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుంది. క్యూబిక్ మీటర్ల చొప్పున రుసుమును ప్రభుత్వానికి చెల్లించి అనుమతి తీసుకుని నిబంధనలు పాటించి తవ్వకాలు చేపట్టాలి. మొరానికి డిమాండ్ ఉండటంతో పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అటువైపుగా రామప్ప చెరువు ఉంది. చెరువు నీరు గ్రామం వైపు రాకుండా పెట్టని గోడ వలె ఈ గుట్ట ఉంటుంది. గ్రామానికి గుట్ట రక్షణగానూ ఉంటుంది
రహదారికి ఆనుకునే ఈ తతంగం సాగుతున్నా... ఏ శాఖ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. 50 ఎకరాలు ఉన్న గుట్టను దాదాపు 10 ఎకరాలకు తీసుకొచ్చారని అంటున్నారు. గుట్ట ఆక్రమణపై ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. గ్రామం మీదుగా లారీలు, ట్రాక్టర్లు వెళుతుంటే ఇబ్బందిగా ఉందని, అక్రమ తవ్వకాలను అరికట్టాలని కోరుతున్నారు. మరోవైపు మొరం, మట్టి రవాణాకు తప్పని సరిగా అనుమతులు తీసుకోవాలని... నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ములుగు జిల్లా గనులశాఖ అధికారులు చెబుతున్నారు. దైత బోడు గుట్టను రెవెన్యూ, గనులశాఖ సంయుక్తంగా వెళ్లి పరిశీలిస్తాయని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: