ములుగు జిల్లా మేడారంలో కొలువైన సమ్మక్క, సారలమ్మ దర్శనానికై అధికసంఖ్యలో భక్తులు ఇవాళ వచ్చారు. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేసి...అక్కడ్నుంచి కాలినడకన సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల వద్దకు చేరుకుని దర్శించుకుంటున్నారు. వడిబియ్యం, పుసుపు-కుంకుమలు, నూతనవస్త్రాలు, నిలువెత్తు బంగారాన్ని మొక్కులుగా సమర్పించుకుంటున్నారు.
ఫిబ్రవరి 5 నుంచి అంగరంగ వైభవంగా జాతర ప్రారంభం కానుంది. మొదటి రోజు...సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి రాగా...రెండో రోజు...సమ్మక్క ఆగమనం...కన్నులపండువగా జరగనుంది. మూడో రోజు గద్దెలపైన వనదేవలంతా కొలువై...భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఫిబ్రవరి 8న సాయంత్రం దేవతల వన ప్రవేశంతో...జాతర ముగుస్తుంది.
ఆదివారం భక్తుల రద్దీతో పస్రా, వెంగలపూర్, చింతల్‌క్రాస్, నార్లపూర్, కోత్తూరు మీదుగా వస్తున్న వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. అప్రమత్తమైన పోలీసులు వాహనాలను జాతర కోసం ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలాలకు తరలించడం వల్ల రాకపోకలు యథాతథంగా కొనసాగాయి.
ఇవీ చూడండి : రామోజీ ఫిలింసిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు