hemachala lakshmi narasimha swamy : ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గుట్టపై కొలువుదీరిన నరసింహస్వామిని దర్శించుకునేందుకు.. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. చాలాకాలం నుంచి ఆలయ నిర్వహణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. కానీ ఇటీవల కాలంలో దర్శనానికి వచ్చే భక్తుల వద్ద వాహన రుసుములు తీసుకునేందుకు అటవీశాఖ ప్రయత్నం చేస్తుందని.. అర్చకులు, అధికారులు, గ్రామస్తులు అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా అటవీ శాఖ ఇలాంటి ప్రయత్నాలు చేయడం సబబు కాదని విమర్శిస్తున్నారు. అర్చకులు, నిర్వాహకులు ఆలయ ఆదాయంతోనే బతుకుతున్నామని తెలిపారు. ఏళ్ల తరబడిగా లేనిది ఇప్పుడే పార్కింగ్ విషయం ఎందుకు గుర్తుకొచ్చిందని నిలదీస్తున్నారు.
వేల ఏళ్లుగా ఆలయ ఆధీనంలోనే ఈ భూమి ఉందని.. నాటి నుంచి ఇప్పటివరకు అటవీశాఖ అధికారులు అటవీ భూమి గురించి ఎప్పుడు రాలేదన్నారు. ఇప్పుడు వచ్చి ఆలయం ఎదురుగా ఉన్న ఆర్చి వరకు అటవీ భూమి అని రాయి పాతి పెట్టారని పేర్కొన్నారు. ఆలయానికి సంబంధించిన పురాతన పత్రాలు ఉన్నాయని, అటవీశాఖ దౌర్జన్యంగా వాహనాల పార్కింగ్ తీసుకోవడానికి ప్రయత్నించడం మంచిది కాదని దేవదాయశాఖ అధికారి సత్యనారాయణ అన్నారు. దేవాలయానికి వెళ్లే దారిలో ఇరువైపులా దుకాణాలు పెట్టేందుకు మల్లూరు గ్రామ ప్రజలను ప్రోత్సహిస్తున్నారని దీనివల్ల దేవాదాయ శాఖకు ఆదాయం తగ్గిపోతుందని తెలిపారు. అటవీశాఖ తీరుపై ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్యకు వినతిపత్రం ఇచ్చామని గ్రామస్తులు వెల్లడించారు.
"దాదాపు 4775 ఏళ్లు నుంచి ఈ క్షేత్రం నడుస్తోంది. ఈ ఆలయంలో నేను 9వ తరం పూజారిగా పూజలు చేస్తున్నాను. దేవస్థానానికి వచ్చిన ఆదాయంతో 24 మంది సిబ్బందికి జీవనోపాధి వస్తోంది. అటవీ శాఖ అధికారులు వచ్చి వాహనాలకు టికెట్ బుకింగ్ పెట్టడం వల్ల దేవాలయ ఆదాయం గండిపడుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి." - రాఘవాచార్యులు, ప్రధాన అర్చకులు
ఇవీ చదవండి: