Medaram Jathara 2022: ములుగు జిల్లా మేడారంలో భక్తుల సందడి కొనసాగుతుంది. అమ్మవార్ల దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. మొక్కులు సమర్పించి వనదేవతల ఆశీస్సులు పొందుతున్నారు. దర్శనం అనంతరం భక్తులకు ఆదివాసీ మ్యూజియం అతిథ్యమిస్తోంది. సమ్మక్క సారలమ్మల పరాక్రమ సమయంలో వినియోగించిన ఆయుధాలు... ఆదివాసీ, గిరిజన ప్రజలు ఆనాటి కాలంలో వినియోగించిన వస్తువులను సజీవ సాక్ష్యాలుగా ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
విలువైన విజ్ఞానం..
జాతరకు వచ్చిన భక్తులకు.. అమ్మవార్ల ఆశీర్వాదంతో పాటు ఆదివాసీ గిరిజన మ్యూజియం ఎంతో విలువైన విజ్ఞానాన్ని అందిస్తుంది. మ్యూజియాన్ని సందర్శించేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. పిల్లలతో కలిసి జాతరకు వస్తుండటం వల్ల.. మ్యూజియంను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కేంద్రంలో భద్రపరిచిన ఆనాటి వస్తువులను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనాటి గిరిజన బతుకు చిత్రాన్ని కళ్ల ముందుంచేలా.. ఏర్పాటు చేసిన కళాఖండాలను తీక్షణంగా వీక్షిస్తున్నారు. పురాతన వస్తువులను ఫొటోలు తీసుకుంటున్నారు. అప్పటి జీవన విధానాన్ని చూపే కళాకృతులతో సెల్ఫీలు తీసుకుని మురిసిపోతున్నారు.
మ్యూజియం చూసి మురిసిపోతూ..
"పూర్వ కాలంలో గిరిజనులు, ఆదివాసీలు వాడిన వస్తువులు మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే అప్పట్లో గిరిజనుల జీవన విధానం ఎలా ఉండేదనేది అర్థమవుతోంది. ఇప్పుడున్న జనరేషన్‌కు పూర్వంలో ఉన్న పరిస్థితులు, వస్తువులు, జీవన విధానం గురించి తెలుసుకునేందుకు ఈ మ్యూజియం చాలా ఉపయోగపడుతుంది. మేడారం జాతరకు వచ్చిన వాళ్లకు కేవలం అమ్మవార్ల దర్శనంతో పాటు.. ఇలా గిరిజనులు, ఆదివాసీల బతుకు చిత్రాన్ని పరిచయం చేసే ప్రయత్నం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ మ్యూజియంను చూసి ఆనందించాలని కోరుకుంటున్నా." - భక్తురాలు
ఇదీ చూడండి: