మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో ఈనెల 19న దారుణ హత్యకు గురైన సైదులు కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆ కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి వెల్లడించారు. మన్సురాబాద్ ఆదర్శనగర్లో నివాసముంటున్న సైదులు, యాదగిరి 15 ఏళ్ల నుంచి స్నేహితులుగా ఉంటున్నారు. సైదులు స్థానికంగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, రెండు పడకల ఇళ్లు ఇప్పిస్తామని ప్రచారం చేసేవాడు. ఇదే క్రమంలో ఆరేళ్లుగా యాదగిరి భార్య ఉప్పలమ్మతో సైదులు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
విషయం తెలిసిన యాదగిరి పలుమార్లు సైదులుతో గొడవకు దిగాడు. ఇంటికి రావద్దని హెచ్చరించినా సైదులు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈనెల 19న ఘట్కేసర్కు సైదులు మద్యం తాగి ఆటోలో వచ్చాడు. ముందే హత్యకు ప్రణాళికతో ఉన్నయాదగిరి ఘట్కేసర్కు చెందిన మహిపాల్, శివతో కలిసి మద్యం మత్తులో ఉన్న సైదులుపై కత్తులతో హత్య చేసి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వివరించారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో కరోనాతో తొలి వైద్యుడు మృతి