మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జరిగిన రోడ్డు ప్రమాదం ఓ పసివాడి ప్రాణాన్ని బలికొంది. అన్న కోసం తమ్ముడు స్కూల్ వ్యాన్ వద్దకు పరుగెత్తుతూ వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమోతు మోహన్, అమ్మున దంపతులు జీవనోపాధి కోసం ఘట్‌కేసర్ మండలం ఇస్మాయిల్‌ఖాన్ గూడలోని నవదుర్గ కాలనీలో నివాసం ఉంటున్నారు. సమీపంలో ఉన్న భవన నిర్మాణాల వద్ద కాపాలదారుడిగా పని చేస్తున్న మోహన్‌కు నాలుగేళ్ల కొడుకు మనోజ్ ఉన్నాడు.
అన్న.. వ్యానే పొట్టనపెట్టుకుంది..
మనోజ్ స్థానికంగా ఉన్న శాంతినికేతన్ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. పాఠశాలకు చెందిన వ్యాన్‌లోనే వెళ్లి వస్తాడు. మనోజ్ వ్యాన్‌లో గుడిసె వద్దకు రావడం గమనించిన తన తమ్ముడు మహేశ్... అన్న కోసం వ్యాన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అప్పటికే తన తల్లి మనోజ్‌ను వ్యాన్‌లోనుంచి తీసుకెళ్లింది. అది గమనించని మహేశ్ మాత్రం వ్యాన్ ముందు రోడ్డు దాటుతుండగా డ్రైవర్ వ్యాన్‌ను ముందుకు పోనిచ్చాడు. దీనితో మహేశ్ వ్యాన్ వెనక చక్రాల కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు.
డ్రైవర్ నిర్లక్ష్యం
ఆ దృశ్యం చూసిన వారు పెద్దగా కేకలు వేసిన వ్యాన్ డ్రైవర్ వినిపించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : 'మా బిడ్డను మాకు అప్పగించండి'