లాక్‌డౌన్ సమయంలో కూకట్పల్లికి ఉపాధి నిమిత్తం వచ్చి హైదరాబాద్లోనే ఉండిపోయిన ఓ కుటుంబానికి… తమ సొంత గ్రామానికి చేరుకునేందుకు కూకట్పల్లి పోలీసులు ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ కాంట్రాక్టర్ మాటలు విని హైదరాబాద్ వచ్చి మోసపోయిన ఆ కుటుంబాన్నివారి ఇంటికి పంపేందుకు పోలీసులు ఆర్థిక సహాయం చేసి అవసరమైన టికెట్లను అందజేశారు.
ఏపీలోని ఒంగోలుకి చెందిన నాగరాజుకు నాలుగు రోజుల క్రితం కూకట్పల్లి నుంచి ఓ కాంట్రాక్టర్ ఫోన్ చేసి పని ఉందని రావాల్సిందిగా తెలిపాడు. కాంట్రాక్టర్ మాటలు నమ్మిన నాగరాజు తన భార్య, ఇద్దరు పిల్లలతో ఒంగోలు నుంచి కూకట్పల్లికి వచ్చి కాంట్రాక్టర్కు ఫోన్ చేశాడు. కాంట్రాక్టర్ ఫోన్ స్విచాఫ్ రావడంతో తెచ్చుకున్న డబ్బులు సైతం అయిపోయాయి.
దీంతో మూడు రోజుల నుంచి భాగ్యనగర్ కాలనీ బస్స్టాప్లోనే కుటుంబంతో నాగరాజు తలదాచుకుంటున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున నాగరాజు కుటుంబాన్ని పెట్రోలింగ్ పోలీసులు చూసి సీఐ నర్సింహరావు దగ్గరికి తీసుకెళ్లారు. సీఐ వివరాలు తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం చేసి, ఒంగోలుకు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. సాయం చేసిన పోలీసులకు నాగరాజు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చూడండి: corona: రాష్ట్రంలో మరో 3,527 కరోనా కేసులు, 19 మరణాలు