Students in Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మేడ్చల్ జిల్లా జీడిమెట్ల షాపూర్‌నగర్‌కు చెందిన విద్యార్థిని కల్పన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెతో పాటు మరో నలుగురు ఉన్నారని విద్యార్థిని తల్లిదండ్రులు మురళి, పుష్ప పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో బంకర్లో తినేందుకు తిండి లేక, తాగడానికి నీరు లేక పిల్లలు అలమటిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఎలాగైనా వారిని భారత్‌కు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. వారికి ఎటువంటి సాయం అందించలేని స్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. బాంబుల శబ్ధానికి విద్యార్థులు భయాందోళనకు గురవతున్నారని వెల్లడించారు. తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్లకు సమాచారం చేరవేశారు. తమ కుమార్తెను ఎలాగైనా త్వరగా తీసుకురావాలని వేడుకున్నారు.
భయంతో బిక్కుబిక్కుమంటూ..
రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థినులు ఉక్రెయిన్‌లో చిక్కుకోగా.. భయంతో బిక్కుబిక్కుమంటూ బంకర్లలో తలదాచుకున్నారు. జీడిమెట్ల షాపూర్ నగర్‌కు చెందిన విద్యార్థిని కల్పన ఖార్కివ్ సిటీలోని యూనివర్సిటీలో 4వ సంవత్సరం చదువుకుంటున్నారు. ప్రస్తుతం ఖార్కివ్‌లో బాంబుల వర్షం మోగుతోందని కల్పనతో పాటు తన స్నేహితురాలు వెల్లడించారు. తమకు తినడానికి తిండి, నీరు సైతం అందుబాటులో లేదని వీడియోలో పేర్కొన్నారు. సుమారు ఐదు వేల మంది భారత విద్యార్థులు తమ పరిసరాల్లో ఉన్నారన్నారు. తెలుగువారే 500మందికి పైగా ఉన్నట్లు తెలిపారు. భారత ఎంబసీ నుంచి తమకి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తమను త్వరగా ఇండియాకి చేర్చాలని వేడుకుంటున్నారు. వారు తలదాచుకున్న బంకర్ వీడియో చూపించారు విద్యార్థులు. కేవలం వెస్ట్ సైడ్ ఉన్నవారిని మాత్రమే భారత్‌కు తరలిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు వారిని త్వరగా భారత్‌కు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.
తిండిలేక అలమటిస్తున్నారు..
మా కూతురు కల్పన ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ పట్టణంలో ఉంది. మా కూతురితో పాటు చాలా మంది విద్యార్థులు అక్కడే బంకర్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. వారికి తినడానికి తిండిలేక, తాగడానికి నీరులేక అలమటిస్తున్నారు. ఎంబసీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తున్నామని చెబుతున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి సమాచారం అందడం లేదు. ఎలాగైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత్‌కు చెందిన విద్యార్థులకు సాయం చేయాలి. ఎప్పుడు చూసినా బాంబుల శబ్ధం వినిపిస్తోందని విద్యార్థులు భయపడుతున్నారు.
-మురళి, కల్పన తండ్రి
ఇక్కడికి తీసుకురండి.. ప్లీజ్..
మా అమ్మాయి కల్పన ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతోంది. మా కూతురితో పాటు ఇంకా నలుగురు ఉన్నారు. దయచేసిన వారిని ఎలాగైనా ఇక్కడికి తీసుకురండి.. ప్లీజ్..
-పుష్ప, కల్పన తల్లి
ఇదీ చదవండి: