New Bride Suicide in Hyderabad : బంధుమిత్రుల సమక్షంలో ఆ తల్లిదండ్రులు బిడ్డకు వైభవంగా వివాహం చేశారు. తమ బాధ్యత తీరిందని ఆనంద బాష్పాలతోనే అత్తింటికి సాగనంపారు. కానీ.. వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. వేసిన పెళ్లి పందిరి తీయలేదు. వచ్చిన బంధువులు ఇంకా వెళ్లలేదు. కాళ్లకు పెట్టిన పారాణీ ఆరలేదు. ఏడడుగులు.. మూడు ముళ్లు.. నూరేళ్ల కలలతో అత్తవారింట అడుగుపెట్టిన ఆ యువతి ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి. బాజాభజంత్రీలు మోగిన ఆ ఇంట్లో.. రెండు వారాలు దాటక ముందే రోదనలు మిన్నంటాయి. నూరేళ్ల దాంపత్య జీవితం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లై 14 రోజులు గడవక ముందే పుట్టింటికి వచ్చి నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ బాపునగర్‌కు చెందిన నవవధువు నిషితకు ఈ నెల 5న మేడ్చల్ మండలం డబిల్‌పురా గ్రామానికి చెందిన సంతోష్‌రెడ్డితో వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టింది నిషిత. కానీ ఏం జరిగిందో ఏమో భర్త ఇంటి నుంచి పుట్టింటికి వచ్చింది. నిన్న(గురువారం) రాత్రి ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురికి విహహం చేశామని.. తమ బాధ్యత తీరిందని ఆనంద పడేలోపే కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతూ ఈ లోకాన్ని విడిచివెళ్లింది. పెళ్లింట పెను విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనకు దారి తీసిన విషయాలపై ఆరా తీశారు.
అల్లుడి వేధింపులు తాళలేకే..: అల్లుడు సంతోష్‌రెడ్డి వేధింపులు తాళలేకనే తన కూతురు నిషిత ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నర్సింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతుందని పేట్ బషీరాబాద్ సీఐ ప్రశాంత్ తెలిపారు. అత్తింటి వేధింపులే కారణమా లేదా ఏ ఇంకా ఏదైనా విషయంలో నవవధువు ఈ దారుణానికి పాల్పడిందా అనే కోణంలోనూ విచారిస్తున్నామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: