ప్రభుత్వ బడులంటేనే చాలా మందికి చిన్న చూపు. విద్యాబుద్ధులు సరిగా నేర్పరని...ఉపాధ్యాయులు పట్టించుకోరని ఇలా రకరకాల మాటలు వినిపిస్తుంటాయి. ఈ అపవాదు పోగొట్టుకుంటూ మెరుగైన విద్యనందిస్తున్న సర్కార్ బడులూ ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలోని మూసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను చూస్తే అది అర్థమవుతుంది. ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు విద్యానిధి పేరిట(govt school create student welfare fund) మొదలు పెట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. విద్యార్థులను పోటీ పరీక్షలకు హాజరయ్యేలా పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. అందుకు అవసరమైన ఖర్చులు కూడా ఈ విద్యానిధి(welfare fund create in govt school) నుంచే చెల్లిస్తున్నారు.
విద్యానిధి ప్రధాన ఉద్దేశం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీ పరీక్షలతోపాటు ప్రతిభావంతమైన పోటీల్లో పాల్గొనడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. తల్లిదండ్రుల పేదరికం కారణంగా ప్రతిభా వంతులై ఉండి కూడా విద్యార్థులు పోటీ పరీక్షలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్, సైన్స్, మ్యాథ్స్ ఒలంపియాడ్ వంటి పరీక్షలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వేత్తలు నిర్వహించే పోటీలు ముఖ్యమైనవి. ఈ పాఠశాలలోని పేద విద్యార్థులు..ఈ అన్ని పరీక్షలకూ హాజరయ్యేలా(Moosa peta Zilla Parishad High School) చూడటమే ఈ విద్యానిధి ఏర్పాటు వెనక ఉద్దేశం. విద్యానిధి(student welfare fund create in Moosa peta govt school) నిర్వాహణకు ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. పేద విద్యార్థుల సంక్షేమానికి దోహదపడుతుందనే భావనతో ఉపాధ్యాయులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయులకు వచ్చిన ఈ వినూత్న ఆలోచన విద్యార్థులకు గొప్ప వరంగా మారడంతోపాటు వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తోంది.
మా పాఠశాలలో మెరికల్లాంటి, మట్టిలో మాణిక్యాలాంటి విద్యార్థులు ఉండటాన్ని మేము గమనించాం. అలాంటి వారికి ఎలాగైనా సాయం చేయాలనే ఒక సదుద్దేశంతో మా పాఠశాల ఉపాధ్యాయులం కొంత నిధిని సేకరించాం. అది సరిపోకపోవడంతో మా పాఠశాల శ్రేయోభిలాషుల సాయంతో విద్యానిధిని ఏర్పాటు చేశాం.- కృష్ణయ్య, ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులు తమ వేతనాల్లోంచి చందాలు వేసుకుని..
పోటీ పరీక్షలకు విద్యార్థులను పంపేందుకు ఉపాధ్యాయులు తమ వేతనాల్లోంచి చందాలు వేసుకుని 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యార్థులు పాఠశాలలోనే ఉండాల్సి వస్తోంది. పలు సందర్భాల్లో ఆహారం అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండేవారు. ఒక్కోసారి దాతలు అల్పహారం అందించే వారు. శాశ్వత పరిష్కారం కోసం ఉపాధ్యాయులు విద్యానిధిని(govt school create student welfare fund) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు రాజ్‌పాల్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశమైన ఉపాధ్యాయులు ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేశారు. విద్యార్థుల విద్యానిధికి దాతలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా సమకూరే నిధులను విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని ముందుకు వచ్చారు.
స్టడీ మెటీరియల్‌తో పాటు రవాణా ఛార్జీలు..
దాతల నుంచి నిధుల సేకరణతోపాటు వాటిని ఖర్చు చేసే బాధ్యతను కమిటీ సభ్యులే చూసేలా తీర్మానించుకున్నారు. పోటీ పరీక్షలకు గతంలో ఈ పాఠశాల నుంచి 10 లోపే విద్యార్థులు హాజరయ్యేవారు. విద్యానిధి ద్వారా ఇక నుంచి 100 మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరయ్యేలా తర్ఫీదునిస్తున్నారు. దాతలు ఇచ్చే విరాళాలను ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలో జమ చేసి లావాదేవీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి అవసరమయ్యే స్టడీ మెటీరియల్ కొనుగోలు చేయడంతోపాటు పరీక్షలు రాయడానికి వెళ్లేందుకు విద్యార్థులకు రవాణా ఛార్జీలనూ విద్యానిధి(student welfare fund) నుంచే ఇస్తున్నారు.
మేము సైతం అంటున్న పూర్వ విద్యార్థులు..
ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థులకు(10th class students news) ఉదయం, సాయంత్రం సమయాల్లో అల్పాహారం అందిస్తున్నారు. పౌష్టికాహారమూ అందించాలని కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం నిధులను విద్యానిధి నుంచే ఖర్చు చేయనున్నారు. ఏ రకమైన పౌష్టికాహారం అందించాలనే అంశంపై ఉపాధ్యాయుల కమిటీ చర్చిస్తోంది. గతేడాది నుంచి కొనసాగిస్తున్న విద్యానిధి కార్యక్రమం గురించి... ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పూర్వ విద్యార్థులూ విద్యానిధికి విరాళాలు ఇస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు కూడా మేము సైతం అంటూ విద్యానిధికి విరాళాలు ఇస్తున్నారు. ఇలా ఎంతోమంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి చేయూత నందిస్తున్నారు. ఈ కార్యక్రమం మరింత మంది పేద విద్యార్థులకు ఉపయోగపడేలా కొనసాగిస్తామని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. తాము పదవీ విరమణ చేసినా విద్యానిధి ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.
నేను 5వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను. ఇది నాకు బడి కాదు... ఒక గుడి. ఇక్కడ నాకు జ్ఞానోదయం అయింది. అందుకే ఈ పాఠశాల అంటే నాకు చాలా ఇష్టం. విద్యానిధి అనేది మంచి ఆలోచన. అందుకే తమవంతుగా విద్యానిధికి సాయం చేస్తున్నాం- హనుమంతరావు, పూర్వ విద్యార్థి
పాఠశాలలో 6 తరగతి గదులు మాత్రమే..
మూసాపేట్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 450మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాలలో 6 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. చాలీచాలని తరగతి గదుల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులను ఆరు బయట కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. గదుల్లో కూర్చోవడానికి బెంచీలు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల నేల మీదే కూర్చుంటున్నారు. ప్రస్తుతం రెండంతస్తుల్లో నడుస్తున్న పాఠశాల భవనానికి అదనంగా మరో అంతస్తు నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఇతర పాఠశాలలకు మార్గదర్శకంగా నిలువాలని..
ఈ విద్యానిధి కార్యక్రమం ఇతర పాఠశాలలకు కూడా మార్గదర్శకంగా నిలువాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు అకాంక్షిస్తున్నారు. ఈ తరహా వైవిధ్య, వినూత్న కార్యక్రమాల వల్ల విద్యార్థులు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకుని రాణించేందుకు అవకాశముంటుంది. ప్రభుత్వం దృష్టి సారించి పాఠశాలలో సమస్యల పరిష్కరిస్తే మరెందరో మెరికల్లాంటి విద్యార్థులను తయారు చేసేందుకు వీలుంటుంది.
ఇదీ చదవండి: ప్రపంచానికి కరోనా 'కొత్త' ముప్పు.. ఆంక్షల చట్రంలోకి దేశాలు!