తొలివిడత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 23తో ఉత్కంఠకు తెరపడనుంది. మల్కాజిగిరి లోక్‌సభ నియోజక వర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు తలెత్తనప్పటికీ అధికారుల పర్యవేక్షణతో సమసిపోయాయి.
ఓటేసిన అభ్యర్థులు
సికింద్రాబాద్ బోయినపల్లిలోని సెయింట్ రీటా పాఠశాలలో మల్కాజిగిరి తెరాస అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. భాజపా అభ్యర్థి రామచంద్రరావు తార్నాక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్‌లోని కొండారెడ్డిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొరాయించిన ఈవీఎంలు
ఎన్నికలు వేగంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఈవీఎంలు మొరాయించి పలుచోట్ల ఆలస్యంగా మొదలయ్యాయి. రామంతపూర్ సెయింట్ జోసెఫ్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో సాంకేతిక కారణాల వల్ల పోలింగ్ ఆలస్యమైంది. వెలుతురు సరిగా లేక ఓటింగ్ సిబ్బంది, ఓటర్లు ఇబ్బంది పడ్డారు. జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఇతర అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ఓటర్లకు ప్రత్యేక వసతులు
కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా ట్రై సైకిల్, ఆటోలు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటేసిన తర్వాత ఇంటిదగ్గర దింపారు. మల్కాజిగిరి సర్కిల్లోని మౌలాలి ప్రశాంత్ నగర్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే హన్మంతరావు సందర్శించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రతి కిలోమీటరుకు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినందున పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పలుచగా కనిపించారు.
ఈసీకి ఫిర్యాదు చేసిన రేవంత్‌రెడ్డి
మల్కాజిగిరి తెరాస అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయనకు చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో సర్వేల పేరుతో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచారం చేయించారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన తెరాస అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారిని కోరారు.
మొత్తం మీద చిన్న చిన్న సంఘటనలు మినహా మల్కాజిగిరి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం తేలేందకు మే 23 వరకు వేచి చూడాల్సి ఉంది.
ఇదీ చదవండి: ముగిసిన తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్