కరోనా వేళలోనూ రైతు సంక్షేమం గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రాయిలాపూర్, పూడూర్ గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణాలకు మంత్రి భూమిపూజ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. రైతువేదికల ద్వారా రైతుల సాధకబాధకాలు చర్చించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కొవిడ్ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఉన్నారు.