MLA help To KPHB Victims Family: మేడ్చల్ జిల్లా కేపీహెచ్‌బీ కాలనీలోని సెల్లార్ గోతిలో పడి మృతిచెందిన చిన్నారుల కూటుంబాలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆర్థికసాయం అందించారు. బాలికల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు సాయం ఇప్పటికే ప్రకటించగా... ఎమ్మెల్సీ నవీన్‌రావుతో కలిసి ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున నగదును అందించారు. గతంలో సెల్లార్ గోతిలో బాలురు మృతి చెందిన సమయంలో ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించామని తెలిపారు. అయినా ఇటువంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని మాధవరం కృష్ణారావు అన్నారు.
శవ రాజకీయాలకు చేస్తున్నారు..
బాధిత నిరుపేద కుటుంబాలకు ఆపన్న హస్తం అందించాల్సిన సమయంలో విపక్షాలు శవ రాజకీయాలకు పాల్పడ్డాయని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హౌసింగ్ బోర్డు పరిధిలోని సెల్లార్ గోతుల ఫెన్సింగ్ వద్ద సెక్యురిటి ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
కేసును వెనక్కి తీసుకుంటాం..
చిన్నారులు తమను వదిలివెళ్లడం కలిచివేసిందని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తమకు అండగా నిలిచారని తెలిపారు. ఇదిలా ఉండగా సోఫియా అనే బాలిక కుటుంబానికి ఓ వ్యక్తి రూ. 10 వేల ఆర్థికసాయం అందించి ఓ పేపర్‌పై సంతకం చేయించుకున్నారని అన్నారు. ఆ సంతకంతో తమకు తెలియకుండానే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసారని పేర్కొన్నారు. తాము ఆ కేసును వెనక్కి తీసుకుంటామని సోఫియా తల్లి ఫరీదాబేగం తెలిపారు.
అసలేం జరిగిందంటే..
కేబీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లోని సెల్లార్ గుంతలో పడి ఈ నెల 24న ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు బాలికలు ఆడుకునే క్రమంలో సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. ఆ ప్రాంతం చిత్తడిగా ఉండటంతో పన్నెండేళ్ల సంగీత... కాలు జారి గుంతలో పడిపోయింది. ఆమెను కాపాడే క్రమంలో ఏడేళ్ల రమ్య, పదేళ్ల సోఫియా నీటిలో మునిగిపోయారు. నేహా అనే బాలిక నీటిలో పడే క్రమంలో చెట్టును పట్టుకొని బయటికొచ్చింది. నవ్య అనే బాలిక అప్పటికే సెల్లార్ ఒడ్డున ఉంది. సెల్లార్ చుట్టూ బారికేడ్లు ఉన్నా... చిన్న సందులోంచి పిల్లలు లోనికి వెళ్లారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కట్టెల పొయ్యి పెట్టి ఆట మొదలుపెట్టారు.. నీళ్ల కోసం వెళ్లిన ఆ ముగ్గురు చిన్నారులు..