దేవరయాంజాల్‌లోని సీతారామస్వామి ఆలయ భూములు దశాబ్దాలు గడిచేసరికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా చేరాయన్న విషయంపై ఐఏఎస్ అధికారుల కమిటీ దృష్టి సారించింది. మామిడి పుల్లయ్య అనే వ్యక్తి సదరు భూములను దేవుడికి గిఫ్ట్ డీడ్‌గా ఇవ్వగా, తర్వాత రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లు వచ్చి చేరాయని అధికారులు గుర్తించారు. ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో వరుసగా నాలుగో రోజు గురువారం దేవరయాంజాల్‌లో ఐఏఎస్ అధికారుల సర్వే కొనసాగింది. సీతారామచంద్రస్వామి ఆలయ మండపంలోని దేవుడి విగ్రహం ముందే కూర్చుని ఆలయ రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. 1521.13 ఎకరాలకు సంబంధించి పహాణీలు, చిత్రపటాలు, సేత్వార్లు ఆసాంతం పరిశీలించారు.
ఆలయ భూముల దస్త్రాల్లో పేర్లు ఏవిధంగా మారాయన్న విషయంపై ఆరా తీశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.25 గంటల వరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు పర్యవేక్షణలో ఐఏఎస్ అధికారులు శ్వేతామహంతి, ప్రశాంత్ జీవన్ పాటిల్, భారతీ హోళికేరితో పాటు విజిలెన్స్, ఏసీబీ, ఎండోమెంట్, రెవెన్యూ అధికారులు రికార్డులు తనిఖీ చేశారు. ఈ సమయంలో భక్తుల్ని, మీడియాను అధికారులు ఆలయంలోకి అనుమతించలేదు. 1925-26 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులు తనిఖీ చేశారు. ఈ రికార్డుల ప్రకారం సీతారామస్వామి ముతావలీ రాముడి పుల్లయ్య పేరిట భూములు ఉన్నాయి. పులయ్య అనే వ్యక్తి సీతారామస్వామి ఆలయానికి గిఫ్ట్ డీడ్‌గా వాటిని ఇచ్చాడు. కానీ 1944 సేత్వార్ ప్రకారం సీతారామస్వామి ముతావలి రాముడి పుల్లయ్య పేరుకు బదులుగా సీతారామస్వామి ఆర్.రామచంద్రయ్య పేరు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత 1954-55 పహాణీ నుంచి ప్రైవేటు వ్యక్తుల పేర్లు వచ్చి చేరినట్లు తేల్చారు. భూములు కబ్జాలకు గురవ్వడంతో ఆలయానికి రావాల్సిన ఆదాయం కోల్పోయిన తీరును ఆరా తీశారు. ప్రస్తుతం ఆలయానికి భూముల ద్వారా ఆదాయం వస్తుందా? లేదా? పరిశీలించారు.
190 కట్టడాల వివరాల సేకరణ
మరోవైపు 8 మంది తహసీల్దార్ల నేతృత్వంలోని బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగించాయి. భూముల్లోని కట్టడాల వివరాలను సేకరిస్తున్నాయి. మొత్తం 219 నిర్మాణాలుండగా, ఇప్పటి వరకు 190 కట్టడాల వివరాల సేకరణ పూర్తయినట్లు తెలిసింది. శుక్రవారం కూడా సర్వే కొనసాగనుంది.
ఈటల వ్యవహారంతో ముడిపెట్టవద్దని వినతి
ఇదే సమయంలో కొందరు రైతులు, గోదాముల నిర్వాహకులు వారి వద్ద ఉన్న రికార్డులతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్‌రావుకు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చారు. ఆయన్ను కలిసేందుకు వీలుకాక పోవడంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆయా భూములను తాము సేల్ డీడ్‌తో కొనుగోలు చేశామని, ఆలయానికి సంబంధించినవి కావని పేర్కొన్నారు. తాము కష్టపడి కొనుగోలు చేశామని, ఈటల రాజేందర్ వ్యవహారంతో ముడిపెట్టి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు.
ఇదీ చదవండి: 'రాజకీయ నేతగా రాలేదు... ఈటలకు ధైర్యం చెప్పేందుకు వచ్చా'