Couple Suicide Attempt News : ఉన్న ఇద్దరు పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పిల్లలకు కష్టం విలువ తెలియకుండా బాధ వాళ్లు పడి.. పిల్లల కళ్లల్లో ఆనందాన్ని చూసుకున్నారు. ఇంత వరకు వారి జీవితం ఎంతో ఆనందంగా సాగింది. కుమార్తెకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలి అనుకొని.. మంచి వరుడుని చూసి పెళ్లి చేశారు. అంతా బాగానే ఉంది అనుకుంటూ సంతోషపడ్డారు ఆ తల్లిదండ్రులు. ఉన్నట్టుంది అల్లుడికి డబ్బుపై వ్యామోహం కలిగింది. ఏం చేయాలో తెలియక భార్యని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు.
Husband Harasses Wife in Shamirpet : కట్న కానుకలుగా ఇచ్చి ఘనంగా పెళ్లి చేసినా.. కుమార్తెను అల్లుడు సక్రమంగా చూసుకోక అదనపు కట్నం కోసం వేధించడంతో కలత చెందిన ఆ తల్లిదండ్రులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన గోనెల సాయిలు (45), లక్ష్మి (40) దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె పూజ, ఓ కుమారుడు ఉన్నారు. ఆ దంపతులు కుమార్తెను శామీర్‌పేట మండల కేంద్రానికి చెందిన మహేందర్‌తో వివాహం చేశారు. పెళ్లి సమయంలో అల్లుడికి 16 తులాల బంగారం, రూ.2 లక్షలు నగదును కట్నంగా ఇచ్చారు.
Couple Suicide Attempt In Shamirpet : కొన్నాళ్లకు అల్లుడు కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. అల్లుడు కుమార్తెను సక్రమంగా చూసుకోకపోవటంతో పాటు అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో సాయిలు, లక్ష్మిలు మనస్తాపం చెందారు. దీంతో దంపతులు తుర్కపల్లిలో ఈ నెల 28న పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు వారిని సిద్దిపేట పరిధిలోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయిలు ఆదివారం మృత్యువాతపడ్డారు. లక్ష్మి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సాయిలు అంత్యక్రియలు చేసేందుకు నారాయణపూర్ గ్రామస్థులు అల్లుడు మహేందర్‌ను రప్పించారు. అక్కడికి వచ్చిన మహేందర్‌పై గ్రామస్థులు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు అక్కడి నుంచి అతడిని పంపించారు. భర్త మహేందర్ వేధింపులతోనే తండ్రి మృతి చెందాడని.. తల్లి ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉందని పూజ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇవీ చదవండి: