Childrens trapped in pond: చెరువులో చిక్కుకున్న ముగ్గురు చిన్నారులను పారిశుద్ధ్య సిబ్బంది రక్షించిన ఘటన మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లిలో జరిగింది. షాపూర్ నగర్‌కు చెందిన నరేశ్, పవన్ బాబు, అనికేత్ ముగ్గురు స్నేహితులు. వీరు షాపూర్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నారు. వీరి తల్లిదండ్రులు దినసరి కూలీలు. వీరు ముగ్గురు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వాహనదారులను లిఫ్ట్ అడిగి బహదూర్ పల్లి చేరుకున్నారు. ముందుగా హనుమాన్ ఆలయం వద్ద కొంతసేపు గడిపారు.
అనంతరం పక్కనే ఉన్న బొబాఖాన్ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఒడ్డున ఉన్న నాటు పడవలో కూర్చుని చెరువు మధ్యలోకి వెళ్లారు. తీరా బయటకు వచ్చేందుకు వీలు కాకపోవడంతో కేకలు వేస్తుండగా అటుగా వెళ్తున్న స్థానికుడు శ్రీకాంత్... చిన్నారుల అరుపులను విని దుండిగల్ మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే పారిశుద్ధ్య సిబ్బంది వెళ్లి చెరువులోకి దిగి బాలురులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. వారిని విచారించగా చేపలు పట్టేందుకు చెరువులోకి దిగినట్లు పిల్లలు తెలిపారు. వారి వివరాలను తెలుసుకుని షాపూర్ నగర్లో ఉంటున్న తల్లిదండ్రులకు అప్పగించారు. క్షణాల్లో స్పందించి చిన్నారుల ప్రాణాలను కాపాడిన మున్సిపల్ సిబ్బంది బాబు, శ్రీకాంత్‌ను పలువురు అభినందించారు.
ఇదీ చదవండి: Inter Student Suicide : తక్కువ మార్కులొచ్చాయని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య