Folk Artist Mogilaiah Passed Away : ప్రముఖ జానపద కళాకారుడు, బలగం సినిమా ఫేమ్ మొగిలయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో వరంగల్ సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం సినిమా క్లైమాక్స్‌లో మొగిలయ్య భావోద్వేగభరితమైన పాట పాడి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయనకు గుర్తింపు వచ్చింది.
కొన్ని రోజులుగా మొగిలయ్య కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మొగిలయ్య చికిత్స కోసం ప్రముఖ నటుడు చిరంజీవి, బలగం దర్శకుడు వేణు ఆర్థిక సాయం చేశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు వరంగల్‌లోని సంరక్ష ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.
మంత్రుల సాయం : ఇటీవల మొగిలయ్య కుటుంబానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. పొన్నం సత్తయ్య అవార్డు అందుకున్న మొగిలయ్య దంపతులకు ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మొగిలయ్య మరణంతో ఆయన స్వగ్రామం దుగ్గొండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. బలగం సినిమా దర్శక నిర్మాతలు వేణు, దిల్ రాజు సంతాపం వ్యక్తం చేశారు.