జవహర్‌నగర్ కేసులో రాచకొండ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. సీఐ బిక్షపతిరావు, కానిస్టేబుల్ అరుణ్‌పై కిరోసిన పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఆక్రమణదారులతో పాటు స్థానిక నేతలపై జవహార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూనం చంద్, నిహాల్ చంద్, శాంతి దేవి, నిర్మల్, బాల్ సింగ్, చినరాం పటేల్, గీత, గోదావరి, యోగి కమల్, మదన్‌తో స్థానిక నాయకులు రంగుల శంకర్, శోభారెడ్డిపై కేసు పెట్టారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆక్రమణదారులు అధికారులను అడ్డుకొని కారం చల్లి, కిరోసిన్ పోశారని కేసులో పేర్కొన్నారు.
పొగ రావడంతో
ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ రంగస్వామి వ్యవహరించనున్నారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. జవహర్‌నగర్ పురపాలక పరిధిలోని సర్వే నంబర్ 432లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించడానికి పురపాలక అధికారులు వెళ్లారు. పోలీసు బందోబస్తుతో కూల్చివేతకు ప్రయత్నించగా ఆక్రమణదారులు అడ్డుకున్నారు. నిహాల్ చంద్, శాంతిదేవి, నిర్మల్ గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నారు. లోపలి నుంచి పొగ రావడంతో... గదిలో ఉన్నవారేవరైనా ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారేమోననే ఉద్దేశంతో సీఐ బిక్షపతి రావు, కానిస్టేబుల్ అరుణ్ ప్రయత్నించారు.
ఇంకెవరైనా ఉన్నారా?
గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపల ఉన్న నిహాల్ చంద్, శాంతిదేవి, నిర్మల్ కలిసి సీఐపై మండే స్వభావం ఉన్న ద్రావణం చల్లారు. దీంతో సీఐ కాళ్లకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. అరుణ్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుల వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'సీఐ ఘటన ప్రమాదమా... ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా?'