Bandi Sanjay on Quthbullapur Public Meeting : రాష్ట్రంలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి పేర్కొన్నారు. బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు ఇచ్చారని విమర్శించారు. ఇప్పుడు హస్తం పార్టీని జాకీ పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ధరణి బాధితులతో భారీ బహిరంగ సభను నిర్వహించవచ్చని అన్నారు. మహజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగామేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay Fires on KCR : ధరణివల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని బండి సంజయ్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వేసిన శిలఫలాకాలతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మించవచ్చని అన్నారు. మరో 5 నెలలు ఆగితే సీఎంను సాగనంపుదామని వివరించారు. ప్రజల కోసం ఉద్యమిస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతిపరుల అంతు చూస్తామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం సత్తా చాటిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేదని అన్నారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని బండి సంజయ్ పునరుద్ఘాటించారు.
"బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే. కాంగ్రెస్‌ను జాకి పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు. ధరణి బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు. ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబమే. కేసీఆర్ వేసిన శిలాఫలాకాలతో ఏకంగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొచ్చు. ప్రజల కోసం ఉద్యమిస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపరుల అంతు చూస్తాం." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యే సమయం ఆసన్నమైంది : అంతకుముందు మాట్లాడిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ సర్కార్ అవినీతి కూపంలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. అతి త్వరలో ముఖ్యమంత్రి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగబోతోందని చెప్పారు. తెలంగాణ సంపదనంతా కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని దుయ్యబట్టారు. ఇక కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యే సమయం ఆసన్నమైందని తరుణ్‌చుగ్ ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మేడ్చల్ రూరల్, అర్బన్ జిల్లాల అధ్యక్షులు హరీశ్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి : Amit shah Telangana Tour Cancel : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
Bandi Sanjay Letter to CM KCR : సారు.. కారు.. కమీషన్ సర్కారు.. మీది కాదా..?