రూ.వంద, రూ.500 నోటు కండక్టరు చేతిలో పెట్టగానే.. టిక్కెట్టు కొట్టి మిగతా చిల్లరంతా వెనక రాయడం ఆర్టీసీలో షరా మామూలే. అవి మరిచిపోయి దిగిపోవడమూ తరచూ జరిగేవే. అయితే ఓ విద్యార్థి ట్వీట్ ద్వారా తన డబ్బు వెనక్కి తెచ్చుకున్నాడు. ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించి డబ్బు పంపేలా చేశారు. సీతాఫల్‌మండికి చెందిన లిక్కిరాజు గురువారం బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో బస్సులో ఎక్కి రూ.100 నోటిచ్చాడు. దిగేటప్పుడు మిగతా డబ్బు తీసుకోమంటూ కండక్టర్ టిక్కెట్ వెనక రూ.80 రాశారు.
గమ్యస్థానం రాగానే ఆ విషయం మర్చిపోయి దిగిపోయిన విద్యార్థికి జేబులో ఒక్క రూపాయీ లేకపోవడంతో చేసేదేం లేక నడుచుకుంటూ ఇంటికెళ్లిపోయాడు. తుది ప్రయత్నంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ తన బాధ వెళ్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన ఆయన జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డిని పరిశీలించమని ఆదేశించారు. శనివారం ఆ ప్రయాణికుడికి చెల్లించాల్సిన రూ.80ని డిపో మేనేజర్ ఫోన్‌పే ద్వారా పంపించారు. ఎండీ, డిపో మేనేజర్ల తక్షణ స్పందనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Parents be alert about Drugs in hyderabad: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. మత్తు మనదాకా రాలేదనుకోవద్దు!