సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. అధికారిక లెక్కల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో బాధితులు వెయ్యికి చేరువలో ఉన్నారు.
సిద్దిపేట, మెదక్ జిల్లాలోనూ ఇదే తీరు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న పట్టణాల్లో వ్యాపారులు ప్రారంభంలో నిర్ణీత సమయంలోనే దుకాణాలు తెరచి ఉంచారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు. తమ సంఘాల్లోని సభ్యులతో చర్చించి.. మూసివేతపై ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
సదాశివపేట నుంచి మొదలు
సదాశివపేట పురపాలక సంఘం మొదట లాక్ డౌన్ బాట పట్టింది. ఈ నెల 1 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అనంతరం.. జహీరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, మెదక్.. ఇలా ఒక్కో పట్టణం లాక్ డౌన్‌లోకి వెళ్తున్నాయి.
కొన్ని పట్టణాల్లో నిర్ణీత సమయంలోనే వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్‌లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. నారాయణఖేడ్‌లో ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. హుస్నాబాద్, పటాన్ చెరులో సాయంత్రం 6గంటల వరకే దుకాణాలు తెరచి ఉంచుతున్నారు.
ఇంకా అనేక గ్రామాలు
పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థానికులు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మొగుడంపల్లి, మిరుదొడ్డి, మాసాయిపేట వంటి గ్రామాల్లోనూ లాక్ డౌన్ విధించారు.
మనోహరాబాద్, కళ్లాకల్ ఇలా పలు గ్రామాల్లో ఉదయం పది గంటల వరకే దుకాణాలు తెరచి ఉంచుతున్నారు. కంగ్టి, జిన్నారం మండలాల్లో ఉదయం 9 నుంచి 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంచుతున్నారు. ఇదే బాటలో ఇంకా అనేక గ్రామాలు వస్తున్నాయి.
లక్ష్యం నెరవేరడం లేదు
వ్యాపార, వాణిజ్య వర్గాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. కొంత మంది అకారణంగా రోడ్ల మీదికి వస్తున్నారని.. కొందరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
ప్రజల రక్షణ కోసం తాము వ్యాపారాలు బంద్ పెట్టుకున్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంత మంది వల్ల లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ వేళ.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాపారుల స్వీయ నియంత్రణ అభినందనీయం.