Two persons fell into a well and died in Medak : రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. దాదాపు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పలు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.
రెండు రోజుల్లో నిశ్చితార్థం అంతలోనే: బావిలో సింగిల్ ఫేస్ మోటార్ దించడానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం రోజున మెదక్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో జరిగింది. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మైసమ్మగారి స్వామి, బాయికాడి ప్రవీణ్ అనే ఇద్దరు యువకులు మరో ఇద్దరితో కలిసి బావిలో మోటారును దించడానికి వెళ్లారు. మరో ఇద్దరు యువకులు పైనే ఉండగా.. స్వామి, ప్రవీణ్‌లు బావిలో మోటర్ దించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఇద్దరూ బావిలో పడి మృతి చెందారు.
వారితో పాటే వెళ్లిన యువకులు ఇచ్చిన సమాచారంతో గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకొన్నారు. మోటార్లతో బావిలోని నీటిని బయటకు పంపించి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. రెండు రోజుల క్రితమే స్వామికి నిశ్చితార్థం అయిందని గ్రామస్థులు తెలిపారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదంలోకి నెలకొంది.
కారు, ఆటో ఢీ ఇద్దరు మృతి: హనుమకొండ జిల్లా పరకాల చలివాగు వద్ద ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అందులో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మృతులు శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన దుబాసి కోమల, కొంగరి చేరాలుగా పోలీసులు గుర్తించారు. మిర్చి తోటలో పనుల కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.
బెంజ్ కారు విధ్వంసం: మరోవైపు.. హైదరాబాద్ రాజేంద్రనగర్ బుద్వేల్‌లో చిన్నారులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న టూవీలర్ వాహనాన్ని తప్పించబోయి రేకుల షెడ్ లోకి బెంజ్ కారు దూసుకెళ్లింది. దీంతో అదే మార్గంలో వెళ్తున్న చిన్నారులకు పెను ప్రమాదం తప్పినట్లైంది. బుద్వేల్ నుంచి కిస్మత్ పూర్ కారు వెళ్తుండగా.. కిస్మత్ పూర్ నుంచి రాజేంద్రనగర్ వైపు ఓ ద్విచక్రవాహనం వస్తోంది. ద్విచక్రవాహనదారులు నిర్లక్ష్యంగా ఉండటంతో.. వారిని తప్పించబోయి రోడ్డు పక్కన రేకుల షెడ్డులోకి కారు దూసుకుపోయింది. కారు యజమాని శ్రీనివాస్ సురక్షితంగా బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: