రాష్ట్రంలో టీఎన్జీవోల సన్మాన సభ ఎక్కడ జరిగినా.. ఆ సభను సమస్యల సభగా నామకరణం చేస్తున్నారని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలను పణంగా పెట్టి, జీతం కోసం కాకుండా.. జీవితం కోసం పోరాటం చేశామని తెలిపారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన రాజేందర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డిలను మెదక్ జిల్లా టీఎన్జీఓ బాధ్యులు ఘనంగా సన్మానించారు.
రెండున్నర సంవత్సరాల నుంచి పిఆర్సీ ఊసే లేదని, పదోన్నతులు కల్పించలేదని రాష్ట్ర ప్రభుత్వంపై రాజేందర్ మండిపడ్డారు. ధరలు ఆకాశాన్నంటుతుంటే.. రెండున్నర సంవత్సరాల నుంతి ఉద్యోగులకు జీతాలు పెరగలేదని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి పదోన్నతులు, బదిలీలు కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పడ్డాక.. అన్ని వర్గాలు అభివృద్ధి సాధించాయి కానీ.. ఉద్యోగులు మాత్రం అలాగే ఉన్నారని పేర్కొన్నారు. 2018 నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీని అమలు చేయాలని, దసరా వరకు ఉద్యోగులందరికి తీపి కబురు చెప్పాలని సీఎంను రాజేందర్ కోరారు.