మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలకు కొవిడ్-19పై ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని మండల వైద్యాధికారి ఆనంద్ ఆదేశించారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి దగ్గు, జ్వరం, జలుబు, గుండెజబ్బు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులపై ఆరాతీయాలని ఆశాకార్యకర్తకు సూచించారు.
వైరస్ గురించి భయపడవద్దు..
ప్రజలు వైరస్ గురించి భయపడవద్దని.. ప్రతి వ్యక్తికి పరీక్ష చేయడం లేదని వైరస్ లక్షణాలు ఉంటేనే నిర్థారణ పరీక్షలు చేస్తున్నట్లు వైద్యాధికారి ఆనంద్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నామని పేర్కొన్నారు. 108 అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని.. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంటెంట్ రఘురాములు, ఆస్పత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జులై ఆఖరుకు దేశంలో 10 లక్షల కేసులు